పోటా పోటీగా కృష్ణ…గుంటూరు..!

Share Icons:

అమరావతి, 19జనవరి:

రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరులు వివిధ అంశాలలో మెరుగైన ఫలితాలు సాధించాయి. రాష్ట్రంలో తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఉత్పత్తి సూచి(జీడీడీపీ)లో కృష్ణా మొదటి ర్యాంకు దక్కించుకోగా గుంటూరు జిల్లా జీడీడీపీలో నాలుగో ర్యాంకు, తలసరి ఆదాయంలో ఆరో ర్యాంకు సాధించింది. తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా దుమ్ము రేపింది. కడప, శ్రీకాకుళం, విజయనగరం మూడు జిల్లాల మొత్తానికి సమానంగా కృష్ణా జిల్లా విలువ ఆధారిత ఉత్పత్తి(జీవీఏ) నిలవడం విశేషం. కృష్ణా జిల్లా వ్యవసాయ రంగంలో రెండు, పరిశ్రమల రంగంలో మూడు, సేవారంగంలో రెండో ర్యాంకు సాధించింది. గుంటూరు జిల్లా వ్యవసాయంలో మూడు, పరిశ్రమల్లో నాలుగు, సేవారంగంలో మూడు ర్యాంకు సాధించింది. ఈ వివరాలను గురువారంనాడు ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం సగటు రూ.1,22,376గా నమోదు అయింది. మొదటి స్థానంలో ఉన్న కృష్ణా జిల్లా తల సరి ఆదాయం రూ.1,61,097గా నమోదైంది. అంటే దాదాపు రూ.45వేలు ఎక్కువగా ఉంది. తమిళనాడు తలసరి ఆదాయం రూ.1,57,116, తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,58,360, కర్ణాటక తలసరి ఆదాయం రూ.1,59,893గా నమోదైంది.

ఈ రాష్ట్రాల తలసరి ఆదాయాన్ని కృష్ణా జిల్లా అధిగమించింది.

 • నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏర్పాటుతో పురోభివృద్ధిలో పయనిస్తున్న గుంటూరు జిల్లా తలసరి ఆదాయంలో ఆరో స్థానంలో నిలిచింది.
 • గత ఏడాదికి 2015-16లో కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలు తలసరి ఆదాయంలో ఒకటో ర్యాంకు, ఆరో ర్యాంకులు సాధించాయి. ప్రస్తుతం 2016-17 సంవత్సరానికి ఆవే ర్యాంకులు నిలబెట్టుకున్నాయి. విస్తీర్ణంలో కృష్ణా జిల్లా 10వ స్థానంలో గుంటూరు జిల్లా 8వస్థానంలో ఉన్నాయి. జనాభాలో కృష్ణా 3, గుంటూరు 2 స్థానంలో ఉన్నాయి.
 • ప్రాథమిక, పరిశ్రమలు, సేవారంగాల్లో మొరుగైన ఫలితాలు సాధించాయి. వ్యవసాయ రంగంలో రెండు జిల్లాలు ముందంజలో ఉన్నాయి.
 • సమస్యల పరిష్కారంలో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో ఉంది. కేవలం 190 విజ్ఞాపనలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. గుంటూరులో 5,530 పెండింగ్‌‌లతో 13వ స్థానంలో ఉంది.
 • చెరుకు, వేరు శెనగ, పత్తి సేద్యంలో కృష్ణ, గుంటూరు ఉత్తమ జిల్లాలుగా గుర్తింపు పొందాయి. జొన్న సాగులో గుంటూరు జిల్లా ఉత్తమ జిల్లాలో ఒకటిగా ఉంది. భూసార పరీక్షల నిర్వహణలో గుంటూరు, కృష్ణా లక్ష్యాలను చేరుకోలేక పోయాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2016 కంటే ఎరువుల వినియోగం పెరిగింది. అలాగే గుంటూరు పురుగు మందుల వినియోగంలోనూ ముందంజలో ఉంది. కౌలు రైతుల రుణాల మంజూరులో కృష్ణా, గుంటూరు 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
 • పండ్లతోటల సాగులో గుంటూరు 74శాతంతో మూడో స్థానంలో ఉండగా, కృష్ణా జిల్లా మాత్రం 5.30శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది.
 • సూక్ష్మ సేద్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలు ఏ గ్రేడ్‌ సాధించాయి. పట్టుపురుగుల పెంపకంలో కృష్ణా 5 స్థానం, గుంటూరు జిల్లా 7 స్థానంలో నిలిచాయి.
 • ఉపాధి హామీ పథకం సామగ్రికి సంబంధించిన నిధుల వినియోగంలో 53శాతంతో గుంటూరు వెనుకబడింది. కృష్ణా 40శాతం మైనస్‌లో ఉంది.
 • రేషన్‌ కార్డుల పంపిణీలో గుంటూరు, కృష్ణా జిలాల్లు అగ్రస్థానంలో ఉన్నాయి.
 • ‌రెవెన్యూ వృద్ధి రేటులో రూ.101 కోట్లు లక్ష్యంకాగా 295కోట్లు వసూలు చేసి కృష్ణా జిల్లా టాప్‌లో నిలిచింది… గుంటూరు రూ 120 కోట్లు లక్ష్యంకాగా.95 కోట్లు వసూలు చేసింది..
 • ‌ఎన్టీఆర్‌ గ్రామీణ, అర్బన్‌ గృహనిర్మాణంలో గుంటూరు, కృష్ణా జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. గుంటూరు నాలుగో స్థానంలో ఉండగా కృష్ణా 8వస్థానంలో ఉంది.
 • ‌పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి గ్రామీణ రహదారులు, పీఎంజీఎస్‌వై నిర్మాణంలో కృష్ణా 6వ స్థానంలో గుంటూరు 8వ స్థానంలో ఉంది.
 • మీసేవా ఫిర్యాదుల పరిష్కారంలో కృష్ణా అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా వెనుకబడింది.
 • కేంద్రీయ వికాస్‌ కేంద్రాల ఏర్పాటులో కృష్ణా జిల్లా 11 వస్థానంలో గుంటూరు 13 వస్థానంలో నిలిచాయి.

మామాట: అభివృద్ధిలో బాగానే పోటీ పడుతున్నారు….

English Summary: Guntur and Krishna District are developing faster equally in all sectors with competition.

One Comment on “పోటా పోటీగా కృష్ణ…గుంటూరు..!”

Leave a Reply