టీఆర్ఎస్ లో కొనసాగుతున్న అసంతృప్తి రాగం…బీజేపీ ఎంపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

former mla somarapu satyanarayana resigns trs party
Share Icons:

హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తి రాగం పెరిగిపోతుంది. వరుసగా నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతోనే నేతలు ఒక్కొక్కరు బయటకొచ్చి కామెంట్లు చేస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల తర్వాత పార్టీలో అసమ్మతి స్వరం గళమెత్తిందని చెబుతున్నారు. ఆయన మంత్రి పదవి పోతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో…తామే అసలు టీఆర్ఎస్ కు ఓనర్లం అని, తనని మంత్రి వర్గం నుంచి ఎవరు తప్పించలేరని వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈయన తర్వాత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగడంతో అసంతృప్తి రాగం ఎక్కువైంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏకంగా కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా, మాజీ మంత్రి జోగు రామన్న తన గన్‌మెన్లను వెనక్కిపంపడం కూడా అందులో భాగమేనని స్పష్టం చేస్తున్నారు. ఆయనతో పాటు అరికెపూడి గాంధీ కూడా తన గన్‌మెన్లను వెనక్కి పంపారు. విప్ పదవిని ఆశించిన ఆయన అది రాకపోవడంతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.

అటు తాను నిఖార్సయిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడినని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని తెలిపారు. ఇక తాజాగా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న షకీల్ బీజేపీ ఎంపీని కలవడంతో, ఆయన పార్టీ మారతారేమో అనే అంశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్యనేత కవితకు సన్నిహితుడిగా షకీల్ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నేత ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న షకీల్… ఏదైనా ఓ నామినేటెడ్ పదవి ఇస్తామనే విషయంలోనూ టీఆర్ఎస్ నాయకత్వం తనకు హామీ ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన పార్టీపై ఒత్తిడి తెచ్చే క్రమంలో నిజామాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిశారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే టీఆర్ఎస్ లో అసమ్మతి రాగం అయితే గట్టిగా వినపడుతుంది.

 

Leave a Reply