ఢిల్లీ రిజల్ట్ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో లుకలుకలు

Share Icons:

ఢిల్లీ: ఒకప్పుడు దేశంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు కష్టాలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరుస పరాభవాలను ఎదుర్కోవడంతో లుకలుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ  ఢిల్లీ కాంగ్రెస్ ఇంఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఢిల్లీ కాంగ్రెస్ పరాభవానికి దివంగత మహిళా నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ చాకో ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.

1998 నుంచి 2013 వరకు షీలా దీక్షింత్ ఢిల్లీ సీఎంగా కొనసాగారు. అయితే 2013లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమాద్మీ పార్టీ రంగప్రవేశంతో కాంగ్రెస్ పార్టీ వైభవం తగ్గుతూ వచ్చింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ.. తాజా ఎన్నికల్లో కూడా ఖాతా తెరవలేకపోయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రజలు బీజేపీని బాగా ఓడించారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ ఓటమిని పట్టించుకోకుండా పక్కపార్టీ గెలుపుపై సంబరాలు చేసుకోవడం ఏమిటంటూ నిలదీశారు. కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ వ్యవహారంపై వివరాల్లోకి వెళితే….

మంగళవారం వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమాద్మీ పార్టీ 62 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీకి 8 స్థానాలు దక్కగా.. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా చిదంబరం స్పందిస్తూ… ‘‘ఆమాద్మీ పార్టీ గెలిచింది. దగాకోరు, బడాయి పార్టీ ఓడిపోయింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఢిల్లీ ప్రజలు.. విభజన రాజకీయాలు చేసే బీజేపీని బాగా ఓడించారు. 2021లో, 2022లో ఎన్నికలు జరగనున్నఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు నా సెల్యూట్…’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై షర్మిష్ట ముఖర్జీ తీవ్ర స్థాయిలో స్పందించారు.

‘‘ సార్.. నేను ఓ విషయం తెలుసుకోవలనుకుంటున్నాను.. బీజేపీని ఓడించే పనిని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ అప్పగించిందా? పార్టీ ఓటమిని పక్కనపెట్టి ఆప్‌ విజయాన్ని సంబరంగా జరుపుకోవడమేంటి? అదే నిజమైతే ఇకపై పీసీసీ దుకాణాలను మూసేద్దామా?..’’ అని గట్టిగా ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా డకౌట్ కావడంపై నిన్న షర్మిష్ఠ ముఖర్జీ బాహాటంగానే తన సొంత పార్టీపై మండిపడ్డారు. ఆత్మ పరిశీలన బదులు సరైన చర్యలకు ఉపక్రమించాలంటూ ఆమె పిలుపునిచ్చారు.

 

Leave a Reply