టీడీపీ లోకి డీఎల్ రవీంద్రారెడ్డి!

Share Icons:

అమరావతి, ఫిబ్రవరి 20,

మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేద్దామని భావించారు.  అప్పటికే తెలుగుదేశం టికెట్ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి ఇవ్వనున్నట్టు  చంద్రబాబు  చెప్పారు. దీంతో ఆయన 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని భావించారు. వైసీపీ తరపున అప్పటికే మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామిరెడ్డి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని తెలిసింది. అయితే అసెంబ్లీ టికెట్ కావాలని డీఎల్ కోరడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.

డీఎల్ రవీంద్రారెడ్డికి టికెట్ ఇస్తే మైదుకూరులో టీడీపీ గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారని తెలుస్తోంది.

టీటీడీ చైర్మన్ పదవి ఉన్నప్పటికీ పుట్టా సుధాకర్ యాదవ్ తాను మైదుకూరు నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో డీఎల్ రవీంద్రారెడ్డి కాస్త వెనక్కి తగ్గారు. సీఎం చంద్రబాబు నాయుడు, జిల్లా టీడీపీ నాయకత్వం పుట్టా సుధాకర్ యాదవ్ ను బుజ్జగించడంతో టికెట్ పై వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

బుధవారం సాయంత్రం కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలి అనే అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చెయ్యనున్నారు. అదే సమయంలో డీఎల్ చేరికపై కూడా పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్లు ప్రచారం.

మామాట: అన్ని పార్టీలూ గెలుపుగుర్రాలకోసమే చూస్తున్నాయిగా,

Leave a Reply