మూడు రాజధానులు చాలా విచిత్రం…

ys. Jagan, Modi , bv. raghavulu ysrcp, bjp,
Share Icons:

అమరావతి: ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న మూడు రాజధానులపై సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు స్పందించారు. ప్రపంచంలోనే విచిత్రంగా మాట్లాడుకునే విషయం ‘మూడు రాజధానులు’ అని, మూడు రాజధానులు’ అన్నదే బాగుండలేదని, ఎప్పుడైనా రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మూడు చోట్ల మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడమన్నది అర్థంలేని విషయమని విమర్శించారు. పరిపాలన, న్యాయం, శాసనం ఈ మూడు కలిసి ఉంటే రాజ్యం బాగుంటుంది కానీ, మూడు ముక్కలు చేస్తే రాజ్యం ఎలా బాగుంటుంది? ‘వికేంద్రీకరణ’ అంటే కింద నుంచి పరిపాలన జరగాలని, పైస్థాయిలో ముక్కలు చేస్తే ఏముంటుందని రాఘవులు ప్రశ్నించారు.

పంచాయతీలను బలపర్చి, వాటికి నిధులు, హక్కులు, బాధ్యతలు ఇచ్చిన తర్వాత పై స్థాయి గురించి మాట్లాడాలని ప్రభుత్వానికి సూచించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి వుంటే కనుక దీనికి పాల్పడ్డ వారిని పట్టుకుని కేసులు పెట్టి శిక్షలు వేయించాలని, దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరని అన్నారు. ప్రభుత్వం ఆవిధంగా చేయకుండా రాష్ట్రాన్ని, ప్రజలను ఇబ్బంది పెడతామనడం, కోపాతాపాలతో రాష్ట్రాన్ని పణంగా పెట్టడం న్యాయం కాదని అన్నారు.

అటు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు పలికారు. తుళ్లూరులో మహాధర్నాను సందర్శించిన ఆయన రైతులకు, వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ఎన్నో వ్యవసాయ రంగ ఉద్యమాలను చూశానని, ఎక్కడా ఇన్నిరోజుల పాటు సాగిన ఉద్యమం చూడలేదని, నూటికి నూరుశాతం రాజధాని అమరావతిలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

సీఎంగా అధికారం చేపట్టాక జగన్ అందరినీ కలుపుకుని పోవాలని, అలాకాకుండా ప్రత్యర్థి పార్టీకి పేరొస్తుందని అన్ని కార్యక్రమాలు నిలిపివేయడం విచారకరం అని వ్యాఖ్యానించారు. అమరావతి ఎంపిక అందరి ఇష్టాలకు అనుగుణంగానే జరిగిందని, కానీ సీఎం జగన్ మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తూ అనిశ్చితి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం రూ.1632 కోట్లు ఖర్చయిందని కేంద్రానికి తెలిపాక కూడా విశాఖకు రాజధాని తరలించడమేంటని ప్రశ్నించారు. హైకోర్టు తరలింపునకు ఎవరి అంగీకారంతోనూ పనిలేదా? అంటూ నిలదీశారు.

 

Leave a Reply