ఢిల్లీ, 7 సెప్టెంబర్:
కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి వెళుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులని కూడా కేసీఆర్ ప్రకటించారు.
అయితే కేసీఆర్ 9 నెలల పాలన కాలం ఉన్న ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీఐ పార్టీ కూడా కేసీఆర్‌పై మండిపడింది. ఈరోజు ఢిల్లీలో నారాయణతో కలిసి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ను నిర్దేశించేలా కేసీఆర్ ప్రకటనలు చేస్తూ.. ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటిస్తున్నారని అన్నారు.
అసలు స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని తాము ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొచ్చామని తెలిపాడు.
ఇక కేసీఆర్‌ది కుటుంబ క్యాబినేట్ అని, చర్చ లేకుండా రెండు నిమిషాల్లో అసెంబ్లీకి రద్దు చేస్తూ క్యాబినేట్ తీర్మానం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఏక వ్యక్తి పార్టీ అని, పార్టీ పొలిట్‌బ్యూరోతో సంబంధం లేకుండా 105 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేశారని సురవరం విమర్శించారు .
అలాగే నారాయణ మాట్లాడుతూ..కేసీఆర్ లక్ష్మణ రేఖ దాటారని, కేసీఆర్ వ్యవహార శైలిపై ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి విచారం వ్యక్తం చేశారని వెల్లడించారు. కేసీఆర్ తీరు చూస్తుంటే శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి..సత్తా చాటుతా అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.
మామాట: సందర్భానికి తగినట్టు సెటైర్లు వేయడంలో నారాయణ తర్వాతే ఎవరైనా…