కరోనా కొత్త వేరియంట్‌ డెల్టాప్లస్‌! ముంచుకొస్తున్న మూడో వేవ్ పై ఆందోళన!

Share Icons:
  • రెండో వేవ్‌ తరహాలోనే దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం
  • సరికొత్త వేరియంట్‌పై రకరకాల అంచనాలు, ఆందోళనలు
  • మహారాష్ట్రలో త్వరలో మూడో వేవ్‌గా మొదలయ్యే అవకాశం
  • కొద్దిరోజులుగా అమెరికా, యూరప్‌ దేశాల్లో డెల్టా ప్లస్‌ ప్రతాపం
  • ఇది మరీ ప్రమాదకరంగా ఉండకపోవచ్చంటున్న వైద్య నిపుణులు
  • అయినాసరే మరో 2, 3 నెలలు జాగ్రత్తలు తప్పనిసరంటూహెచ్చరికలు

 కరోనా రెండో వేవ్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ స్థాయిలో కేసులకు కారణమైన కరోనా డెల్టా వేరియంట్‌ నియంత్రణలోకి వస్తోంది. కానీ ఇంతలోనే డెల్టా వేరియంట్‌ మ్యుటేషన్‌ చెంది.. కొత్తగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా మారిందని పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. ఈ వేరియంట్‌ కారణంగా మూడో వేవ్‌ రావొచ్చన్న అంచనాలతో మరోసారి ఆందోళన మొదలైంది. ఇప్పటికే దేశాన్ని గడగడలాడించిన డెల్టా నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనివల్ల ప్రమాదం ఎంత వరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, వ్యాక్సిన్లతో ప్రయోజనం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో ఇప్పటికే చాలామంది డెల్టా వేరియంట్‌ బారినపడి కోలుకున్నందున, డెల్టా ప్లస్‌ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కొందరు వైద్య నిపుణులు, పరిశోధకులు చెప్తున్నారు. మరోవైపు దేశంలో కొన్ని కేసులే నమోదయ్యాయని, దాని ప్రభావమేంటో తెలిసేందుకు ఒకటిరెండు నెలలు పడుతుందని, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండక తప్పదని మరికొందరు సూచిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

దేశంలో కరోనా రెండో వేవ్‌ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్‌ కూడా మొదలుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో- ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఇదే హెచ్చరిక చేసింది. కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా మూడో వేవ్‌ రావొచ్చని అంచనా వేసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, భారీగా గుమిగూడటం ఇలాగే కొనసాగితే.. మరో నెల రోజుల్లోనే మూడో వేవ్‌ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా పరిస్థితిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ఇటీవల ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మూడో వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించారు. మూడో వేవ్‌ తీవ్రంగా ఉండొచ్చని, కేవలం మహారాష్ట్రలోనే యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరొచ్చని… బాధితుల్లో పది శాతం వరకు పిల్లలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. కాగా మన దేశంలో వచ్చిన కరోనా రెండు వేవ్‌లలో మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితమైంది. తొలివేవ్‌లో 19 లక్షల కేసులు, రెండో వేవ్‌లో ఏకంగా 40 లక్షల కేసులు వచ్చాయి. మూడో వేవ్‌లో ఇంతకు రెండింతలుగా ఏకంగా 80 లక్షల వరకు కేసులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. మూడో వేవ్‌ సన్నద్ధతలో భాగంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని.. బెడ్లు, ఆక్సిజన్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మహారాష్ట్ర సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టాలని సూచించారు. పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవాలని.. ప్రజలంతా భౌతిక దూరం, మాస్కులు వంటి కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.

జార్ఖండ్‌ రాష్ట్రంలోనూ పలు డెల్టా ప్లస్‌ కోవిడ్‌ కేసులను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కొందరు పేషెంట్ల శాంపిల్స్‌ను భువనేశ్వర్‌లోని ల్యాబ్‌కు పంపామని, అక్కడ చేసిన వైరస్‌ జన్యు పరీక్షల్లో డెల్టా ప్లస్‌గా గుర్తించినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌ మరింత ప్రమాదకరం కావొచ్చని, దీని వ్యాప్తి తీవ్రతపై ఇంకా నిర్ధారణ జరగాల్సి ఉందని జార్ఖండ్‌లోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) మైక్రో బయాలజీ విభాగం అధిపతి మనోజ్‌ కుమార్‌ వెల్లడించారు.

కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ (బీ.1.167.2)లో మ్యూటేషన్లు జరిగి డెల్టా ప్లస్‌ (ఏవై.1)గా రూపాంతరం చెందింది. కరోనా వైరస్‌ మన శరీర కణాలకు అతుక్కుని, లోపలికి ప్రవేశించేందుకు తోడ్పడే స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు జరిగాయి. ఈ మార్పును ‘కే417ఎన్‌’గా పిలుస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసిన వ్యాక్సిన్లలో చాలా వరకు ఈ స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే పనిచేస్తాయి. ఇప్పుడీ ప్రొటీన్‌లోనే మార్పులు రావడంతో వ్యాక్సిన్లు ఎంత వరకు ప్రభావం చూపగలవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ సోకడం, వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీల నుంచి కొత్త వేరియంట్‌  తప్పించుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా ప్లస్‌ వేరియంట్‌లో వచ్చిన కొత్త మార్పులు కేవలం పదిశాతమేనని, దాని ప్రభావం మరీ ఎక్కువగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వ్యాప్తి విపరీతంగా ఉన్నా.. ప్రమాదకరంగా మారే అవకాశం తక్కువనే ఆశాభావం కనిపిస్తోంది. కాగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ ఔషధం ప్రభావం నుంచి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తప్పించుకుంటున్నట్టుగా ఇటీవలి పరిశోధనల్లో గుర్తించారు.

  1. మొదటి వేవ్‌ చివరిలో ఏర్పడిన కరోనా వేరియంట్లు మ్యుటేట్‌ అయి ఈ ఏడాది జనవరిలో డెల్టా వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. ఇది రెండో వేవ్‌కు కారణమైంది.
  2. ఇప్పుడా డెల్టా రకం మరింతగా మ్యుటేషన్‌ చెంది ‘డెల్టా ప్లస్‌ (ఏవై 1)’గా మారింది. ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో దీనితో కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ దీంతో మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
  3. కోవిడ్‌ నిబంధనలను పాటించకుంటే మరో నెల రోజుల్లోనే మూడో వేవ్‌ మొదలవుతుందని, డెల్టా ప్లస్‌ విజృంభించే చాన్సుందని మహారాష్ట్ర సర్కారు ఇటీవలే హెచ్చరించింది.
  4. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆ రాష్ట్రంలో తొలిసారిగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసు నమోదైంది. ఓ మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించిన అధికారులు.. కాంటాక్టులకు టెస్టులు చేయిస్తున్నామన్నారు.
  5. జార్ఖండ్‌లోనూ డెల్టా ప్లస్‌ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర సర్కారు పేర్కొంది.

సేకరణ :-  మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply