దేవుడా…కరోనా వైరస్ బారిన పడకుండా ప్రపంచాన్ని కాపాడు…

Share Icons:

తిరుపతి: కరోనా వైరస్…ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్. భూగోళాన్ని చుట్టేసిన ఈ వైరస్ వేలమందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిలో తిష్ఠ వేసుకుని కూర్చుంది. ఈ కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ దాని మీద దృష్టిని కేంద్రీకరించాయి. దాన్ని నియంత్రించడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.

భారత్‌పైనా పంజా విసిరిందీ వైరస్. దీన్ని నియంత్రణపై అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఏపీ, తెలంగాణల్లో క్వారంటైన్లు, ఐసొలేషన్ వార్డులు పెద్ద ఎత్తున ఏర్పాటు అయ్యాయి.

అయితే ఎంత చేసిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. భారత్‌లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 169కి చేరింది. రోజురోజుకూడా ఈ సంఖ్యలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. దీనిపై ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సన్నిహితుడు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ బారి నుంచి ఇక ఆ దేవుడే ఈ ప్రపంచాన్ని కాపాడాల్సి ఉందని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏడుకొండలవాడే దిక్కు అంటూ ఆయన ప్రార్థించారు. వెంకటేశ్వర స్వామికి చెందిన ఓ చిన్న వీడియో క్లిప్‌ను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. గోవింద నామాలతో కూడిన వీడియో అది. కరోనా వైరస్ బారి నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేది ఆ దేవుడొక్కడేనంటూ ఆయన కామెంట్స్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తోటి రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డిలకు ట్యాగ్ చేశారు.

Leave a Reply