* తెలంగాణాలో కొరోనా విజృంభణ – ఉల్లంఘనులపై హైకోర్టు కన్నెర్ర *

Share Icons:

తెలంగాణలో కొరోనా కేసుల సంఖ్య  రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా  పెరుగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా ఎగబాకుతున్నది..  బుధవారం ఒక్కరోజే కొరోనా కేసులు రెండు వేలు దాటాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 2055 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3,18,704కు చేరింది.

కొరోనాతో బుధవారం ఏడుగురు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 1,741కు చేరింది. బుధవారం 303 మంది వైరస్‌ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారిసంఖ్య 3,03,601గా నమోదయింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 13,362  యాక్టివ్‌ కేసులుండగా ..  8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

**ఉల్లంఘనులపై హైకోర్టు కన్నెర్ర.** 

కోవిడ్‌ నిబంధలను ఉల్లంఘిస్తున్న మద్యం షాపులు, రెస్టారెంట్లు, పబ్‌ల లైసెన్స్‌లు రద్దు చేసి, వాటి నిరివాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర వ్రభుత్వాన్ని ఆదేశించింది. కొరోనా పరీక్షలు చేయించుకున్న వారినే రాష్ట్రంలోకి అనుమతించాలని పేర్కొంది. తెలంగాణలో కోవిడ్‌ నియంత్రణ, పరీక్షలపై గురువారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కొరోనా టెస్టులు, టీకాపై ప్రభుత్వం పూర్తి నివేదికను సమర్పించగా,  కొరోనా టీకాను 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, పనిప్రాంతాల్లో, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి టీకా వెంటనే వేయాలని సూచించింది. 22 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సిలెండర్లు అందుబాటులో పెట్టామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు..

-ఎన్నార్కె

Leave a Reply