కరోనా మరణ మృదంగం: పెరుగుతున్న మృతుల సంఖ్య..

Coronavirus update: 170 killed, evacuations begin, While House may ban all US-China flights
Share Icons:

బీజింగ్: చైనాలో కరోనా మరణ మృదంగం ఆగలేదు. ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఆగని మరణాలు ఆ దేశవాసుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 57 మంది చనిపోవడం షాకిచ్చింది. ఇప్పటివరకు 361 మంది చనిపోయినట్లు తెలిసింది. ఇక ఇది చాలదన్నట్లు ఒకేరోజు కొత్తగా 2,829 మంది వ్యాధి బారిన పడ్డారని తేలడం, వీరిలో 186 మంది పరిస్థితి విషమంగా ఉందని నిర్థారణ కావడంతో ఈ మరణ మృదంగం ఎక్కడికి చేరుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 17,205కి చేరింది. మరో 1,89,583 మంది అనుమానితులు ఉన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చైనా నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తోంది. మరోవైపు భారత్‌లోని కేరళ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రజలు చైనా ప్రయాణాన్ని మానుకోవాలని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.

ఇదిలా ఉంటే చైనాతోపాటు 25 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-వీసాల(ఆన్‌లైన్ వీసాలు)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆదివారం బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. చైనీయులు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుందని బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ఇప్పటికే ఈ-వీసాలు జారీ చేసిన వారికి కూడా అవి చెల్లవంటూ సమాచారం అందించినట్లు పేర్కొంది. ఎవరైనా ఖచ్చితంగా భారత్‌కు వెళ్లాల్సి ఉంటే మాత్రం అందుకు తగిన కారణాలతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది.

కాగా, ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్ నగరం నుంచి 600 మందికిపైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపడుతోంది.

 

Leave a Reply