ప్రమాదకర స్థాయిలో కరోనా…

Share Icons:
 తెలంగాణా రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ వైరస్‌ ఉధృతి పెరుగుతుండగా, కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతోంది. తాజాగా, గత 24 గంటల్లో కొత్తగా 4,446 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 33,514కు చేరుకోగా 22,118 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, కొరోనా పాజిటివ్‌ కేసుల పట్టికలో జీహెచ్‌ఎంసి 598 తో మొదటి స్థానంలో ఉంది. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తరువాత జీహెచ్‌ఎంసి పరిధిలో కేసుల సంఖ్య 500 దాటడం ఇదే తొలిసారి. ఆ తరువాతి స్థానంలో 444 కేసులతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా రెండో స్థానంలో నిలచింది.
 ఒకవైపు, రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో పడకలు బాధితులతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాలలో మొత్తం 6044 ఆక్సీజన్‌ పడకలు ఉండగా, వాటిలో ఇప్పటికే దాదాపు 60 శాతానికి పైగా కోవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. కేవలం 40 శాతం మాత్రమే ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు హాస్పిటల్స్‌లో దాదాపు 57 శాతం పడకలు కొరోనా బాధితులతో నిండిపోయాయి. కేవలం గత 10 రోజుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో 40 శాతం పడకలు కొరోనా బాధితులతో నిండిపోవడం రాష్ట్రంలో కోరోనా ఉధృతికి నిదర్శనం.
కొత్తగా ఎవరికైనా కోవిడ్‌ సోకి ఆక్సీజన్‌తో కూడిన పడకలు అవసరం అయితే, ఉన్న వారు కోలుకుని డిశ్చార్జి కావడం లేదా చుట్టుపక్కల జిల్లాలకు వారిని తరలించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కొరోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో ఉన్న మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న జిల్లాలు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలో కేసుల సంఖ్య కేవలం 5 రోజుల్లోనే రెంట్టింపు సంఖ్యను దాటింది.
(STATE NEWS)

Leave a Reply