ఖమ్మంలో కాంగ్రెస్‌ని ఖాళీ చేస్తున్న గులాబీ పార్టీ

Share Icons:

ఖమ్మం, 15 మార్చి:

గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జట్టుకట్టి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల, టీడీపీ 2 చోట్ల విజయం సాధించాయి. ఇక వీటిల్లో ఎక్కువ స్థానాలు వచ్చినవి ఖమ్మం జిల్లా నుంచే కావడం విశేషం. కాంగ్రెస్ 6, టీడీపీ2, ఇండిపెండెంట్ 1, టీఆర్ఎస్ 1 గెలుచుకుంది.

అయితే పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేగ కాంతారావు, హరిప్రియనాయక్, ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.

తాజాగా, మాజీ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీలో చేరే విషయమై.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడా జిల్లాలో సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కతో సాటు, కోడెం వీరయ్య మాత్రమే మిగిలారు.

కాగా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు కూడా కారు ఎక్కేశారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి కూడా గులాబీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక వనమా చేరికతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 99కి చేరనుండగా.. కాంగ్రెస్ బలం 12కు చేరనుంది.

అయితే మొత్తం సభ్యుల్లో పదిశాతం సంఖ్యాబలం (12) కలిగిన కాంగ్రెస్.. ప్రతిపక్ష హోదాలో ఉంది. అయితే, ప్రస్తుతం ఆ సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండడంతో హస్తం పార్టీ.. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇప్పటికే మండలిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్.. మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ప్రాతినిథ్యం కూడా చేజార్చుకోబోతోంది. మరి చూద్దాం ఇంకా ఎంతమంది కారు ఎక్కుతారో

మామాట: తెలంగాణ ప్రజలకి ప్రతిపక్షం అక్కర్లేదు అనమాట

Leave a Reply