హిందీ రాష్ట్రాల్లో…కాంగ్రెస్ కొత్త ఫార్ములా

congress new plans to won the north india states in next elections
Share Icons:

న్యూఢిల్లీ,, ఆగస్టు 26:

కాంగ్రెస్ వ్యూహరచన వర్క్ అవుట్ అవుతుందా? హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు ఎంతో దూరంలో లేదా? అవుననే అంటున్నారు హస్తం పార్టీ నేతలు. ప్రధాని మోదీ ఇమేజ్ బాగా తగ్గిపోవడం, ప్రాంతీయ పార్టీల హవా పెరిగిపోవడం తమకు కలసి వచ్చే అంశంగా హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.

ప్రధానంగా రాహుల్ టీం ఈ అంచనాలకు వచ్చేసింది. ముఖ్యంగా ఉత్తరాదిన తమ బలం పెరిగిందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో ఉత్తరాదిలోని కొన్నికీలక రాష్ట్రాల్లో ఉన్న 200 పార్లమెంటు స్థానాలకు గాను బీజేపీ 155 స్థానాలను దక్కించుకుంది. కానీ ఈసారి అది సాధ్యం కాదన్నది హస్తం పార్టీ నేతల అంచనా. నాలుగున్నరేళ్లలో పరిస్థితి పూర్తిగా తమ హస్తగతం అయిందంటున్నారు.

ఈసారి యూపీలో లెక్క మారుతుందా?

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలను తీసుకుంటే అక్కడ గత ఎన్నికల్లో 80 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 71 స్థానాలు వచ్చాయి. కానీ ఈసారి ఆ ఫలితం తారుమారవుతుందంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలు కలసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళితే దాదాపు యాభైకి పైగా స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని గణాంకాలతో సహా వివరిస్తున్నారు.

గత ఎన్నికల్లో అప్పటి వరకూ గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, ఇమేజ్ కలసి వచ్చింది. యూపీఏ పదేళ్ల పాలనపై ఉన్న అసంతృప్తి కూడా దీనికి తోడు కావడంతో హిందీ బెల్ట్ లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ప్రాంతీయ పార్టీలకూ అవకాశమివ్వకుండా కమలం పార్టీ దూసుకెళ్లింది. కానీ క్రమంగా తగ్గుతున్న మోదీ ప్రాభవంతో ఈసారి ఒక్క యూపీలోనే మెజారిటీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. యూపీలో మహాకూటమి దాదాపు ఖరారైన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే దిశగా బీజేపీని ఓడించాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది.

బీహార్‌లో లాలూతో జట్టు….

మరో ముఖ్యరాష్ట్రమైన బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కమలం పార్టీ వైపే ఉంటారన్నది తేలిపోయింది. ఇందుకు ఇటీవల జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికే ఉదాహరణ, ఇక జనతాదళ్ (యు) బీజేపీతోనే కలసి ప్రయాణించే అవకాశమున్నందున బీహార్ లోనూ గత ఎన్నికల్లో మాదిరి మహాకూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. గత ఎన్నికల్లో బీహార్‌లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో 31 స్థానాల్లో బీజేపీ గెలిచింది. లాలూ ప్రసాద్ యాదవ్ పై కక్ష్యసాధింపు చర్యలు తమకు కలసివస్తాయన్న విషయం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలతోనే స్పష్టమయిందని చెబుతున్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ప్రాంతీయ పార్టీలతో కలసి జాతీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ కలసి నడిచి వెళితేనే వచ్చే ఎన్నికల్లో మోదీని మట్టికరిపించగలమన్న నిర్ణయానికి వచ్చారు.

ఇందుకు ఫార్ములాను కూడా కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. గత ఎన్నికల్లో గెలిచిన, రెండోస్థానంలో నిలిచిన సీట్ల ఆధారంగా పొత్తులో ఉన్న పార్టీలకు స్థానాలను కేటాయించాలని నిశ్చయించారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే ఫార్ములాను అనుసరించాలని భావిస్తున్నారు. దీనివల్ల యూపీ లాంటి రాష్ట్రాల్లో కొన్ని సీట్లు తమకు తగ్గినా కొన్ని రాష్ట్రాల్లో తమకే ఎక్కువ స్థానాలు లభిస్తాయని చెబుతున్నారు. త్వరలో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం లాంటి రాష్ట్రాలో సుమారు 65 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో సమిష్టిగా రాణించి లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగించాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంగా ఉంది. అందుకోసమే కాంగ్రెస్ ప్రధానమంత్రి పదవిని కూడా వద్దనకుంటోందన్న వాదనలు ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ ప్లాన్ సక్సెస్ అయితే.. మోదీ మరోసారి ప్రధాని కాకుండా అడ్డుకట్టవేసే అవకాశముంది.

మామాట: మరి కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరకు విజయం సాధిస్తాయో?

Leave a Reply