మూడు పార్టీల మధ్య కుదిరిన డీల్…కానీ మంత్రి పదవులపై….!

Congress-NCP-Shiv Sena may announce to form government friday
Share Icons:

ముంబై: ఎట్టకేలకు మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సి‌పి, కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.  శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి మహారాష్ట్ర వికాస అఘాడ పేరుతో కూటమి ఏర్పాటు చేయబోతున్నాయి. అయితే శివసేనకు మద్ధతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ నిర్ణయం ఇంతవరకు తేలలేదు. కానీ తాజాగా శివసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని పృథ్వీరాజ్ చౌహన్ తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అన్ని అంశాలపై పార్టీల మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి శుక్రవారం అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

ఇక మూడు పార్టీల పొత్తు సెట్ కావడంతో ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే ప్రమాణం చేయనున్నారు. ఆయన అభ్యర్థిత్వానికే కాంగ్రెస్-ఎన్సీపీ ఆమోదం తెలిపాయి. ఆదిత్య పేరు తెరపైకి వచ్చినా.. ఆ రెండు పార్టీలు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రత్యామ్నాయం ఉద్దవే కనపించారు. మంత్రి పదవులు మాత్రం సమానంగా పంచుకోనున్నారు. మహారాష్ట్రలో 14-14-14తో మూడు పార్టీలు మంత్రి పదవులు పంచుకోవాలని అభిప్రాయానికి వచ్చాయి. సీఎం పదవీ రొటేషన్ గురించి ఎన్సీపీ మాత్రం ఎలాంటి డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. ఉద్దవ్ సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్-ఎన్సీపీ సుముఖంగానే ఉన్నాయి.

కానీ ఏ శాఖలు తీసుకోవాలనే దానిపై మాత్రం చిక్కుముడి వీడటం లేదు. ఏర్పడబోయే ప్రభుత్వంలో మంత్రి పదవుల విషయంలో అన్ని మూడు పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలన్న కాంగ్రెస్.. స్పీకర్, ఆర్థిక శాఖ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూశాఖలు తమకు కావాలని కోరుకుంటోంది. శివసేన పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ, హోం మంత్రిత్వశాఖ, ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి శాఖలను అడుగుతోంది. మరో కూటమి పార్టీ అయిన ఎన్సీపీ స్పీకర్ పదవితోపాటు హోంశాఖ, ఆర్థికశాఖ, పీడబ్ల్యూడీ, జలవనరులు, గ్రామీణాభివృద్ధి శాఖలను కోరుకుంటోంది.

మొత్తానికి మూడు పార్టీలు ఆర్థికశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు కావాలని పట్టుబడుతుండగా, స్పీకర్ పదవి తమకు కావాలంటూ కాంగ్రెస్, ఎన్సీపీలు కోరుతున్నాయి. శివసేన, ఎన్సీపీలు పీడబ్ల్యూడీ, హోంశాఖలు అడుగుతున్నాయి. దీంతో ఈ విషయంలో నేడు తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. మరి చూడాలి శాఖలపై కూడా క్లారీటీ వస్తే ప్రభుత్వ ఏర్పాటు త్వరగా జరగనుంది.

 

Leave a Reply