త్వరలో టీపీసీసీ మార్పు…నేను రేసులో ఉన్నా

Share Icons:

హైదరాబాద్: త్వరలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రావొచ్చని, త్వరలో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండొచ్చని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నట్లు తెలిపారు. అలాగే త్వరలో సోనియాగాంధీని కలవనున్నట్లు చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని ప్రకటించారు.

కేసీఆర్‌కు రాష్ట్రాభివృద్ధి కంటే కమీషన్లపైనే మక్కువ ఎక్కువ అని విమర్శించారు. ఐదేళ్లుగా నిధులివ్వకుండా పల్లె, పట్టణ ప్రగతి అంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టీ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్… అధిష్టానం కొత్తవారిని ఎంపిక చేస్తే ఆ బాధ్యతలను వారికి ఇచ్చి బరువు దింపుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల దగ్గర కూడా పలుసార్లు చెప్పినట్టు వార్తలు వినిపించాయి. ఇక టీ పీసీసీ చీఫ్ పదవి దక్కించుకునేందుకు ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు వీహెచ్ వంటి సీనియర్ నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలోనే కొత్త టీ పీసీసీ బాస్ వస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నా… కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఈ అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకోకపోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. టీ పీసీసీ చీఫ్ పదవిపై తెలంగాణలోని పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారని… తమకు ఈ పదవి రాకపోతే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారని హైకమాండ్‌కు కొందరు నేతలు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. దీంతో టీ పీసీసీ చీఫ్‌ పదవికి కొత్త వారిని ఎంపిక చేసి కొత్త కష్టాలు తెచ్చుకోవడం ఎందుకని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

అయితే కొత్త టీ పీసీసీ చీఫ్ కావాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో ఆలస్యం చేయడంపై అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

Leave a Reply