కేసీఆర్, కేటీఆర్ లపై రాములమ్మ వ్యంగ్యస్త్రాలు….

Share Icons:

హైదరాబాద్:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీరుపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ఈరోజు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ… కేసీఆర్, కేటీఆర్ లపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ పదేపదే ‘‘సారు.. కారు.. సర్కార్’’ అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయిందని వ్యాఖ్యానించారు. ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కేసీఆర్ బొమ్మను, కార్ గుర్తును, టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థం అవుతోందన్నారు.

రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్‌ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కేసీఆర్ రాజకీయ కోణంలో చూసి వాటిని లైట్‌గా తీసుకునే ప్రమాదం ఉందన్నారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారని, అలాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఇక కేసీఆర్ నియంతృత్వ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాలని పిలుపునిచ్చారు. ధర్మో రక్షతి రక్షితః అనే నానుడికి తగ్గట్లుగా హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టీఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నాను అని పోస్ట్ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వంపై రాజాసింగ్ విసుర్లు…

యాదాద్రి ఆలయ గోడలు, స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, కారు బొమ్మ, ఆయన తీసుకొచ్చిన పథకాలను చెక్కుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఈ విషయం కేసీఆర్ కు తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల ద్వారా కేసీఆర్ తనను తాను భగవంతుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ స్తంభాలను వెంటనే తీసేయాలనీ, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వీటిని తొలగించకుంటే తెలంగాణ ప్రజలతో కలిసి తామే తొలగిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.

ఏంతో ప్రాశస్త్యం ఉన్న యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నది ప్రభుత్వ బాధ్యత అనీ, ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు, పార్టీ జేబుల నుంచి డబ్బులు పెట్టడం లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో గుడి కడుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సరికావని హితవు పలికారు. ఈ విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Leave a Reply