
కొడంగల్, 5 డిసెంబర్:
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ అజాద్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న పోలీసుల కస్టడీ నుండి రేవంత్ విడుదలైన అనంతరం ఆయనను కొడంగల్‌లో పరామర్శించిన ఆజాద్ మీడియాతో మాట్లాడారు.
అధికారంలో ఉన్నామని కళ్లు నెత్తికి ఎక్కకూడదని, కాళ్లు నేలపైనే ఉండాలని, రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు కేసీఆర్ రేవంత్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం అన్నది ఎన్నటికీ శాశ్వతం కాదనీ, ఈ రోజు సీఎం కుర్చీపై కేసీఆర్ ఉన్నారనీ.. రేపు అదే కుర్చీపై రేవంత్ రెడ్డి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
ఇక రేవంత్ సీఎం అవ్వొచ్చు అని ఆజాద్ చెప్పగానే కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
ఇదిలా ఉంటే ఆజాద్ వ్యాఖ్యలతో టీకాంగ్రెస్‌లో కలకలం చెలరేగేలా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నేతలు ఉన్న సంగతి తెలిసిందే.
మామాట: ఏమో…కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు…