ఎమ్మెల్యే అయ్యాక రూటు మార్చిన కాంగ్రెస్ నేత….

Share Icons:

హైదరాబాద్, 7 ఫిబ్రవరి:

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అయితే ఈ మధ్యకాలంలో అది మరింత ఎక్కువగా ఉంది. అందుకే ఉదాహరణే గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం. అసలు కేసీఆర్‌పై ఇంతకాలం పోరాడిన వంటేరు హఠాత్తుగా టీఆర్ఎస్‌లో చేరడంతో అందరూ షాక్ అయ్యారు.

ఇక ఈ బాటలోనే తాజాగా సంగారెడ్డి నుండి గెలిచిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్‌లోనే చేరతారని ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహారశైలి ఉందని తెలుస్తోంది. అసలు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి….ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక టీఆర్‌ఎస్‌ని, కేసీఆర్‌ని విమర్శించనని ప్రకటించారు. ఇక నియోజకవర్గం కోసం కేసీఆర్‌ని కలుస్తానని ప్రకటించారు. ఇక తాజాగా బీజేపీలో తనను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరిగిన సమయంలో కేసీఆర్ పిలిచి తనకు టిక్కెట్టు ఇచ్చారని జగ్గారెడ్డి చెప్పారు. కేసీఆర్ వల్లే తాను 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టు ఆయన చెప్పారు. తనకు కేసీఆర్ కుటుంబంతో వైరం లేదని స్పష్టం చేశారు.

అసలు తనకు కేసీఆరే రాజకీయ జీవితం ఇచ్చారు అన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. అలాగే తాను జైలులో ఉన్నపుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న హేమా హేమీ నాయకులు చూడడానికి కూడా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వీహెచ్ తప్ప మరెవరు తనను వచ్చి పరామర్శించలేదని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్‌ పార్టీలో లాబీయింగ్ చేసిన వాళ్ళకే పదవులు వస్తాయని జగ్గారెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా లాబీయింగ్‌లకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.

ఇక ఈ పరిణామాలని గమనిస్తే త్వరలోనే జ‌గ్గారెడ్డి తెరాస గూటికి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మరి జగ్గారెడ్డి కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చి టీఆర్‌ఎస్‌లో చేరతారో లేదో చూడాలి.

మామాట: మరి జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో

Leave a Reply