జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి పాగా…సీఎం పీఠం ఎవరిదంటే?

Congress-JMM alliance has a slight advantage over ruling BJP
Share Icons:

రాంచీ: జార్ఖండ్‌లో అధికారం ఎవరిదో తేలిపోయింది. కాంగ్రెస్, జేఎమ్‌ఎమ్‌, ఆర్జీడీల కూటమి దూసుకుపోతోంది. కౌంటింగ్ ప్రారంభమైన నుంచి ముందంజలో ఉన్న కూటమికి ఆ తరువాత బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఓ దశలో ఇరు పక్షాల మధ్యా నువ్వా నేనా అన్నట్టు రసవత్తర పోటీ నెలకొంది. ఆ తరువాత కాంగ్రెస్ క్రమంగా రేసులో దూసుకెళ్లిపోయింది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ కూటమి 41 స్థానాల్లో ముందగుడులో ఉండగా బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏజేఎస్‌యూ 3 స్థానాలు, జేవీఎం 3 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

కొంచెం ఈ ఫలితాలే దాదాపు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే… ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులకూ, తమ సమీప ప్రత్యర్థులకూ మధ్య ఓట్ల గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అదీకాక… బీజేపీకి ఆధిక్యం చాలా తక్కువగా ఉంది. జార్ఖండ్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 81. అందువల్ల మేజిక్ మార్కు 41. ఆ ప్రకారం చూస్తే… కాంగ్రెస్ కూటమికి అధికార పగ్గాలు చేపట్టే ఛాన్స్ క్లియర్‌గా కనిపిస్తోంది. అందుకే ఆ ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్… నెక్ట్స్ సీఎంగా… జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను ప్రకటించేసింది.

ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం, ఎన్‌ఆర్‌సిపై ఉన్న వ్యతిరేకతా తమకు కలిసొచ్చిందని కాంగ్రెస్, జే‌ఎం‌ఎం వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు సాధించి కూడా అధికారాన్ని చేపట్టలేకపోయిన బీజేపీకి… ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రం చేజారిపోతుండటం షాకింగ్ అంశమే.

జార్ఖండ్‌లో ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్, 21న ఐదోదశ ఓటింగ్ జరిగింది. 2014లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీకి 37, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 5, జార్ఖండ్ ముక్తి మోర్చా 19, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. జేవీఎం (పీ) పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించినా, వారు ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు.

 

Leave a Reply