వార్ రూమ్ లో కాంగ్రెస్ మంతనాలు

Share Icons:

కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 08,

ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమే అసలు లక్ష్యం. అందుకు సీట్లు తగ్గించుకునైనా మహాకూటమిని ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా కన్పిస్తోంది. వార్ రూమ్ లో మహాకూటమిపై దఫదఫాలుగా చర్చలు కాంగ్రెస్ అగ్రనేతలు జరుపుతున్నారు. మోదీని మరోసారి అధికారంలోకి రానిస్తే ప్రతిపక్షాలను లేకుండా చేస్తారన్న ఆందోళన ఇటు కాంగ్రెస్ లోనూ, అటు ప్రాంతీయ పార్టీల్లోనూ ఉంది. అదే భయం ప్రాంతీయ పార్టీల నేతలు మహాకూటమివైపు అడుగులు వేయించేలా చేస్తుందని హస్తం పార్టీ సీనియర్ నేతలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి కోసం రెండు ఫార్ములాలను రూపొందించినట్లు తెలుస్తోంది.ఒక ఫార్ములా ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే మహాకూటమిగా ఏర్పడటం. ఈ జాబితాలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను చేర్చారు.

అలాగే రెండో ఫార్ములా ప్రకారం ఎన్నికల అనంతరం పొత్తు. ఇలా ముందుకు వెళితే తప్ప మోదీని ఓడించలేమన్న నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రాల వారీగా కూటమి ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించ నున్నట్లు సమాచారం. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉండటం, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉండటం, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉండటంతో రెండు ఫార్ములాలతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ వార్ రూమ్ డిసైడ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి.ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో మహాకూటమి ప్రక్రియ వేగవంత మయిందంటున్నారు. ముందుగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మహాకూటమిని ముందుగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉత్తరప్రదశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలతో వీలయినంత తొందరగా మహాకూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

ఈ మేరకు అఖిలేష్ యాదవ్, మాయావతితో చర్చించాలని నిర్ణయించారు. 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ఈసారి 70 స్థానాలను సాధించి మోదీ ఢిల్లీ గద్దెనెక్కకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఈ మహాకూటమికి ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించారు.అలాగే మరో పెద్దరాష్ట్రమైన బీహార్ లో కూడా రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ కూటమిని ముందుగానే ప్రకటించనున్నారు.ఇక్కడ బీజేపీ, జనతాదళ్ యు లుకలసి పోటీ చేస్తాయనే నమ్మకం ఇటీవల కాలంలో సన్నగిల్లింది. అదే జరిగితే బీహార్ లో కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్ సభ ఎన్నికలు జరిగినా అక్కడ కూడా మెజారిటీ స్థానాలను సాధిస్తామన్న విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో కూడా జేడీఎస్ తో ఎన్నికలకు ముందుగానే పొత్తులు పెట్టుకుంటారు. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఆ యా రాష్ట్రాల రాజకీయాలకు అనుగుణంగా ఎన్నికల అనంత రమా? ముందా? అన్నది నిర్ణయించనున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మోదీని ఓడించేందుకు చేస్తున్న కసరత్తులు ఏమేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

మామాట:  వార్ రూమ్ లో అనుకునేవన్నీ ఓటరు ముందు చెల్లుతాయా

Leave a Reply