కాంగ్రెస్ కు  పునర్జీవమే నా!

Share Icons:

విజయవాడ, ఆగస్టు 29,

ఏపీలో కాంగ్రెస్ కోలుకుంటుంద‌ని, వచ్చే ఎన్నికల తరువాత ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఇటీవ‌ల ఏపీ కాంగ్రెస్ నాయకులు ఊద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గ‌ట్టి పోటీ ఇస్తామ‌ని, ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేది కూడా తామేన‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పాత కాపుల‌కు పెద్ద పీట వేస్తున్నారు. పాత వారు తిరిగి రావాలంటూ పెద్ద ఎత్తున పిలుపు కూడా ఇస్తున్నారు. మ‌రి ఈ క్ర‌మంలో ఎంత మంది పాత వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో తెలియ‌దు కానీ, వెళ్లే వారిని మాత్రం కాంగ్రెస్ నాయ‌కులు ఆప‌లేక పోతుండ‌డం పెద్ద లోటే. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు పెట్టుకుని అన్ని పార్టీలూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ కూడా తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరుతామ‌ని వాగ్దానం చేస్తోంది. ఈ విష‌యాన్ని లోక‌ల్ గానే కాకుండా విదేశాల్లోనూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అదేవిధంగా విభ‌జ‌న హామీల‌ను సైతం నెర‌వేర్చుతామ‌ని చెప్పారు. ఇక‌, వైసీపీని తుద‌ముట్టించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని కూడా ప్ర‌క‌టించారు. త‌మ టార్గెట్ జ‌గ‌నేన‌ని చెప్పారు. త‌మ కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేసుకుంటామన్నారు. అయినా కూడా.. పార్టీలోకి ఎవ‌రూ కొత్త‌వారు రాక‌పోగా.. పోయిన పాత‌వారు సైతం అడుగు పెట్టేందుకు భ‌య‌ప‌డుతున్నారు.

ఇదిలావుంటే, తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గా ప‌ద‌వులు అనుభ‌వించిన మ‌రో యువ నాయ‌కుడు సైతం పార్టీకి రాం రాం ప‌లుకుతున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాం నియోజక‌వ‌ర్గం నుంచి తొలిసారి గెలిచిన కొండ్రు ముర‌ళీ మోహ‌న్‌.. వెంట‌నే మంత్రి ప‌ద‌విని అలంక‌రించారు. అయితే, ఇన్నాళ్లుగా పార్టీలోనే ఉన్న కొండ్రు తాజాగా టీడీపీలోకి చేరేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి ఆయ‌న ప్లాన్ ఇప్పుడే తెర‌మీదికి వ‌చ్చింది. అంటే,. కాంగ్రెస్ నాయ‌క‌త్వం పాత వారికి పెద్ద పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీని నిర్ణ‌యిస్తామ‌ని చెప్పిన త‌ర్వాత త‌గిలిన పెద్ద ఎదురు దెబ్బ ఇదే!ఇక క‌ర్నూలులో బ‌లంగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల ఫ్యామిలీ కూడా పార్టీలో ఉండాలా ? వ‌ద్దా ? అన్న ఊగిస‌లాట‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పార్టీలో ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు పోటీ చేసేందుకు ఆస‌క్తిగా లేర‌ని స‌మాచారం. కోట్ల త‌న‌యుడు టీడీపీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో పార్టీ ఇక బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేది ఎక్క‌డో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి.

ఇదిలావుంటే .. తూర్పు గోదావ‌రి జిల్లాలో కాంగ్రెస్‌ను న‌డిపించే నాధుడే క‌రువు కావ‌డం మ‌రో దారుణం. ఇక్క‌డ కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న పంతం నానాజీ పార్టీ మార‌డంతో  పార్టీ కొత్త సార‌ధిని వెతుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింది.ఇక నాయ‌కుల సంగ‌తి అలా ఉంచితే ఏపీలో కాంగ్రెస్‌ను న‌మ్మేందుకు ప్ర‌జ‌లు సైతం సాహ‌సించ‌ని ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఏపీని కాంగ్రెస్ అడ్డ‌గోలుగా విభ‌జించింద‌న్న బాధ ఏపీ జ‌నాల్లో బ‌లంగా ఉండిపోయింది. ఈ క్ర‌మంలోనే వారు త‌మ తీవ్ర ఆగ్ర‌హాన్ని గ‌త ఎన్నిక‌ల్లో ఓట్ల రూపంలో చూపించారు. మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపాజిట్లు మిన‌హా గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ ఒక్క ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేదు. అప్ప‌ట‌కీ, ఇప్ప‌ట‌కీ ప‌రిస్థితుల్లో మార్పు లేదు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న కాంగ్రెస్.. అధికార పార్టీని నిర్దేశిస్తుంద‌ని, ఏదో కొత్త బ‌లం చేకూరుతుంద‌ని ఆశించ‌డం మ‌బ్బుల్లో నీళ్ల‌ను వెతుక్కోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మామాట: మాయ మాటలు చెప్పడం ఇంకా మానలేదా కాం..

Leave a Reply