టీడీపీ-కాంగ్రెస్ పొత్తు చర్చల కమిటీలో రేవంత్ రెడ్డి…

Share Icons:

హైదరాబాద్, 7 సెప్టెంబర్:

తెలంగాణలో రాజకీయాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అలెర్ట్ అయ్యాయి. ఎలాగైనా సరే ఈ సారి టీఆర్ఎస్‌ను ఓడించాలని ప్రతిపక్షాలైన టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీతో పొత్తుల చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది.

ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా ఎదిగి హస్తం గూటికి చేరిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కీలక నేత మధుయాష్కీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోస్ రాజులకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

టీడీపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి… ఏఏ స్థానాలను కేటాయించాలనే విషయమై  కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ నేతలతో చర్చించనున్నారు. రెండు రోజుల క్రితం గోల్కోండ హోటల్ లో టీడీపీ నేత ఎల్. రమణతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  సమావేశమయ్యి సీట్ల పంపకంపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇక శనివారం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌కి వచ్చి పొత్తులపై  చర్చించి తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ముందే కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీతో చర్చించే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహాబూబ్ నగర్ ,ఖమ్మం జిల్లాలో  టీడీపీతో పొత్తు కారణంగా ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.

మామాట: మరి చూడాలి ఈ పొత్తు వ్యవహారం ఎంత వరకు సఫలమవుతుందో?

Leave a Reply