మా ఎమ్మెల్యే డబ్బుకోసమే బీజేపీకి అమ్ముడుపోయారు: జేడీఎస్ మంత్రి

congress and jds leaders sensational comments on bjp
Share Icons:

బెంగళూరు:

 

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతోన్నాయి. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో బలపరీక్షకి సిద్ధమైన జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తూ….బలపరీక్ష వాయిదా పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోవాలంటూ సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజూ భాయ్ వాలా లేఖలు రాసిన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం 1.30 గంటల లోపు బలనిరూపణ చేసుకోవాలని మొదటి లేఖలో గవర్నర్ చేసిన సూచించారు. అలా జరగకపోవడంతో, ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు మెజార్టీ నిరూపించుకోవాలని రెండో లేఖలో ఆయన సూచించారు.

 

అయితే స్పీకర్ ఇవేమీ పట్టించుకోకుండా సభని సోమవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే నిన్న విశ్వాస పరీక్ష చర్చ సందర్భంగా కాంగ్రెస్-జేడీఎస్ నేతలు బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.  బలపరీక్ష సందర్భంగా జేడీఎస్ మంత్రి మహేశ్ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ డబ్బుల కోసం బీజేపీకి అమ్ముడుపోయారని, తన పిల్లలపై ఒట్టేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది.

 

విశ్వనాథ్ గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారని, నాలుగు నెలల క్రితం తాను స్వయంగా వెళ్లి ఆయనను బుజ్జగించానని గుర్తు చేశారు. ఎన్నికల కోసం చేసిన అప్పు రూ.28 కోట్లు ఉందని, దానిని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా ఆయన తనతో చెప్పారని పేర్కొన్నారు. అయితే, అంతమొత్తాన్ని ఒకేసారి ఇవ్వడం తనకు కూడా సాధ్యం కాదని, కావాలంటే నెలకి కొంత చొప్పున సర్దుతానని భరోసా ఇచ్చానని మహేశ్ పేర్కొన్నారు. నెల తర్వాత కొంత మొత్తం ఇవ్వాలని భావించి ఫోన్ చేస్తే ఆయన ముంబైలో ఉన్నట్టు తెలిసిందన్నారు.

 

ఇక ‘తమతో చేతులు కలిపితే రూ.30కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్‌ చేసిందని, వద్దని తిరస్కరించినా ఆ పార్టీ నేతలు బలవంతంగా తమ ఇంటికి వచ్చి రూ.5కోట్లు ఉంచి వెళ్ళారంటూ’ కోలారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ సంచలన ఆరోపణ చేశారు.  బలపరీక్షపై శాసనసభలో చర్చ జరుగుతున్న తరుణంలో శ్రీనివాసగౌడ లేచి ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో తానూ బాధితుడినేనని చెప్పుకొచ్చారు. తమ ఇంటికి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి వచ్చి రూ.5కోట్లు బలవంతంగా పెట్టి వెళ్ళారన్నారు. బీజేపీ నేతలు ఎంత ప్రలోభ పెట్టినా అటువైపు వెళ్ళలేదన్నారు.

Leave a Reply