రైతు భరోసా ప్రారంభించిన జగన్…రైతులకు చెక్కుల పంపిణీ….

Cm Ys Jagan Launches Ysr Rythu Bharosa at Nellore
Share Icons:

నెల్లూరు: వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైఎస్సార్ రైతు భరోసా- పి‌ఎం కిసాన్ పథకాన్ని ఈరోజు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా… కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్… పథకాన్ని ప్రారంభించి… కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ… రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇచ్చారు.

రైతు భరోసా కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 సాయం చేయనుంది. మొత్తం కలిపి రైతులకు రూ. 13,500 రానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పి‌ఎం కిసాన్ పథకం కింద ఎన్నికల ముందే రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు వేయగా, తర్వాత మరో 2వేలు వేశారు. అయితే కేంద్ర సాకారంతో చేయనున్నారు కాబట్టి ఈ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పి‌ఎం కిసాన్ అని పేరు పెట్టారు.

ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. నాన్న గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో గొప్ప మార్పులు తీసుకొస్తామని చెప్పారు. అలాగే ప్రతి ఏడాది ఖరీఫ్ పంట వేసే సమయానికి మే నెలలో రూ.7,500 ఇస్తామని, అక్టోబరులో మరో రూ.4 వేలు, అంతేగాక, ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి సమయంలో మరో రూ.2 వేలు ఇస్తామని అన్నారు.

అలాగే కౌలు రైతులకు కూడా మేలు చేసేలా ఈ పథకం అమలు చేస్తామని,  పంటల బీమా కోసం ప్రీమియం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందిని జగన్ చెప్పారు. రైతులు నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులతో నష్టపోయే పరిస్థితి రాకుండా చూస్తామని, రైతులకు భరోసా ఉంటేనే రాష్ట్రానికి భరోసా ఉంటుందని అన్నారు. నాణ్యతతో కూడిన విత్తనాలు, పురుగు మందులు అందిస్తామని, గ్రామ సచివాలయాల పక్కనే నాణ్యతతో కూడిన విత్తనాలు అందిస్తామని, నెల్లూరులో పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  రైతులు పడుతున్న ఇబ్బందులను తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో చూశానని, గత ఐదేళ్లలో లక్షల రైతుల కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. నిన్నటి కన్నా నేటి పరిస్థితులు బాగుంటేనే అభివృద్ధి సాధిస్తున్నట్లు అర్థమని,  రైతుల పరిస్థితులు బాగుపడేలా పనులు కొనసాగిస్తున్నామని జగన్ వ్యాఖ్యానించారు.

 

Leave a Reply