‘కంటివెలుగు’ ప్రారంభం: జగన్ పుట్టినరోజున కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు…

cm-ys-jagan-launches-ysr-kanti-velugu-scheme-in-anantapur
Share Icons:

అనంతపురం: ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయడానికి సీఎం జగన్ ‘వైయస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని తీసుకొచ్చారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నేడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కంటి వెలుగు పథకం కింద మూడేళ్ల పాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని ప్రజలందరికీ అవసరమైన నేత్ర పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు.

ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు తొలి దశ పరీక్షలను నిర్వహిస్తారు. తొలి దశలో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో దశలో నవంబర్ 1 నుంచి 31 వరకు కంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారిని విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్సలను నిర్వహిస్తారు. క్యాటరాక్ట్ ఆపరేషన్లు, కళ్లద్దాలను, ఇతర సేవలను ఉచితంగా అందిస్తారు. జనవరి 1 నుంచి ఈ పథకం అందరికీ అందుబాటులోకి వస్తుంది.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించేందుకు ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు.అలాగే ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, మార్కాపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, ఏలూరు, పులివెందులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటాను తయారు చేస్తామని,  ప్రతి ఒక్కరికీ ఓ కార్డు ఇస్తాం. డిసెంబర్ 21న (ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు) అందరికీ కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని ప్రకటించారు.

లబ్ధిదారులకు సంబంధించిన హెల్త్ డేటా అందులో ఉంటుందని, ఆ కార్డుతో ఏ ఆస్పత్రికి వెళ్లినా.. వారి అనారోగ్య సమస్యల డేటా మొత్తం తెలిసిపోతుందని అన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి సమూలంగా మార్చేస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్య శ్రీలో 1000 వ్యాధులు ఉన్నాయని, వాటిని ఇంకా పెంచుతున్నామని తెలిపారు. డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా అందులోకి తీసుకొస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

ఇక ఆరోగ్య శ్రీలోకి మొత్తం 2వేల వ్యాధులను తీసుకొచ్చి జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

 

Leave a Reply