ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ దూకుడు…వెనక్కి తగ్గని కార్మికులు…

Share Icons:

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె సంచలనాలు సృష్టిస్తోంది. తమ డిమాండ్లని నెరవేర్చాలని కార్మికుల సమ్మెకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక కార్మికులతో ఎలాంటి చర్చలూ జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సమయంలో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి చర్చలు చేసే సమస్యే లేదని చెప్పారు.

ఆయితే గడువు లోపు, అంటే ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం ప్రకటించారు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకొని నడపాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆర్టీసీ మనుగడ సాగించాలంటే కొన్ని చర్యలు తప్పవనీ, భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించి, క్రమశిక్షణారాహిత్యం, బ్లాక్‌మెయిల్ విధానం శాశ్వతంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అటు కేసీఆర్ మాటలపై ఆర్టీసీ నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. సమ్మె తీవ్రతరం కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ విలీన అంశం మేనిఫెస్టోలో లేదని చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన శక్తులను నిర్మూలించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నుపడిందని, సంస్థకు చెందిన రూ.60 వేల కోట్ల స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు

అలాగే ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ ను చూసి మన రాష్ట్రం నేర్చుకోవాలంటూ కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తమ పోరాటంలో ధర్మం, న్యాయం ఉందని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. తాము కూడా న్యాయపరంగానే ముందుకెళతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

అటు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తొలగించి కొత్త సిబ్బందిని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఆ ప్రకటన ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయడం ఓ భాగమన్నారు. వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించడం ముఖ్యమంత్రి అహంభావానికి నిదర్శనమని మండిపడ్డారు.

 

Leave a Reply