పార్టీని గెలిపించు…పదవి పట్టు: నేతలకు జగన్ కొత్త రూల్ పెట్టారా?

Share Icons:

అమరావతి:

ఏపీలో సీఎం జగన్ అధికార పీఠం అధిరోహించి వంద రోజులు దాటిన విషయం తెలిసిందే. ఈ వందరోజుల్లోనే జగన్ అనేక కొత్త నిర్ణయాలు తీసుకుని పరిపాలనలో దూసుకుపోతున్నారు. అలాగే ఏపీ చరిత్రలో ఏ కేబినెట్ తీసుకొని అన్నీ నిర్ణయాలని జగన్ కేబినెట్ ఒకేసారి తీసుకుని సంచలనం సృష్టించింది. నూతన ఇసుక విధాన గానీ, పోలవరం రివర్స్ టెండరింగ్ గానీ ఇలా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా టీటీడీ బోర్డు సభ్యులని ఖరారు చేసిన జగన్…ఇంకా చాలానే నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇక వీటికి చాలామంది ఆశావాహులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ అనుయాయులకు పదవులు అప్పగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఈ ఆశావాహులకు ఓ సరికొత్త రూల్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు అధికార వైసీపీ ఇప్పటి నుండే సన్నద్ధం అవుతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ నేతలకు ఓ రూల్ పెట్టినట్లు సమాచారం.

నామినేటెడ్ పోస్టులకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముడి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలను రాబట్టడంలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో అలాంటి వారికి నామినేటెడ్‌ పోస్టులను కట్టబెట్టేందుకు పరోక్ష నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు నేతల మధ్య ఇప్పటికే ఉన్న పోటీని తగ్గించేందుకు వీలవుతుందని, మరోవైపు అనుకూల ఫలితాల కోసం పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తారని జగన్ భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలను లక్ష్యంగా తీసుకుని, పార్టీలో నేతలు, కేడర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. పదవుల కోసం నెలకొని ఉన్న ఒత్తిడి..స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల్లో సైతం వైసీపీ జెండా ఎగుర వేసి , పూర్తిగా టీడీపీని కోలుకోలేని దెబ్బ తీయాలని జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక త్వరలోనే దీనిపై కార్యాచరణ రూపొందించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని సమాచారం. మొత్తం మీద వైసీపీ నేతలు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటితేనే నామినేటెడ్ పదవి దక్కించుకోగలరు. అంటే ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు సాధించిపెట్టేవారు పదవి దక్కించుకోవచ్చు.

Leave a Reply