ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కు వచ్చాం…మనం అక్కడే ఉండిపోవాలా?

Share Icons:

అమరావతి: ప్రతి పేద విధ్యార్ధి ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే లక్ష్యంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మరో పదేళ్లలో ప్రపంచం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటి పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెబితేనే అప్పటికి రాణించగలుగుతారని అన్నారు. ఇప్పటికే లాండ్ ఫోన్ రోజుల నుంచి స్మార్ట్ ఫోన్‌లో అడుగు పెట్టామని, ఎక్కడ చూసినా ఇంటర్నెట్ కనిపిస్తోందని.. మరో పదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుందని.. అప్పటికి అంతా రోబోటిక్స్‌దే ప్రధాన పాత్ర అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లిష్ చదువు లేకపోతే, మన పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడలేకపోతే వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నానన్నారు.

ఒక మంచి నిర్ణయం అన్నది సరైన సమయంలో తీసుకోకపోతే భావితరాలు అంధకారంలోకి వెళ్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీలో నిలిచేందుకు పేద విద్యార్థులకు ఇంగ్లిష్ విద్య చాలా అవసరమని ఆయన అన్నారు. ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి, ఏ జర్నలిస్టు, ఏ సినీ నటుడు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంలో చదివించడం లేదని.. అందుకే పేద విద్యార్థుల కోసం సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో పేద వర్గాల పిల్లల్లో చదువు రాని వాళ్లు 33 శాతం ఉన్నారని, మరో పదేళ్ల తర్వాత కూడా వాళ్లు ఇలాగే ఉండిపోవాలా? అని అన్నారు.

విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే.. తనను రాజకీయంగానూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. వారందరూ తమ గుండెలపై చేయి వేసుకొని మనస్సాక్షిగా మాట్లాడాలని అడుగుతున్నానన్నారు. వైస్ ప్రెసిడెంట్, సినీ రంగంలో ఉన్న పెద్ద వాళ్లు తన నిర్ణయాన్ని వేలెత్తి చూపుతున్నారని, వాళ్ల పిల్లలు, మనవళ్లే ఇంగ్లిష్ మీడియం చదవాలా? పేదవాళ్లు చదవొద్దా? అని అడుగుతున్నానని సభాముఖంగా ప్రశ్నించారు. ఇక విద్యా విధానాన్ని మార్పు చేసి.. మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. మరో 20 ఏళ్లలో పోటీ ప్రపంచంతో పడేలా చేయడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

 

Leave a Reply