మరో సారి కుమ్ములాటకు సిద్దమయిన కరణం, గొట్టిపాటి….

Share Icons:
ప్రకాశం: 1 డిసెంబర్

ప్రకాశం జిల్లా టిడిపి నేతలలైన కరణం-గొట్టిపాటి మధ్య వివాదాలు మరోసారి ఉద్రిక్తతకు దారితీసాయి. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటిల నియామక అంశం గొడవకు కేంద్ర బిందువైంది.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సచివాలయంలో జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు చాంబర్‌లో గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌ ఆ సమావేశంలో సచివాలయం సాక్షిగా కయ్యానికి కాలుదువ్వారు.

ప్రకాశం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంత్రి శిద్దాతోపాటు బాపట్ల పార్లమెంటు ఇన్‌చార్జి, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.కరణం మొదటినుండి టిడిపిలోనే ఉండగా గొట్టిపాటి  కాంగ్రెస్ లో ఉండేవారు.

ఇద్దరు చెరో పార్టీలో ఉండేవారు కాబట్టి పార్టీలో అంతర్గతంగా ఎవరికీ ఇబ్బందులుండేవి కావు. అయితే, చంద్రబాబు చేసిన పని వల్ల గొట్టిపాటి టిడిపిలోకి ఫిరాయించారు. అక్కడి నుండి ప్రత్యర్ధులిద్దరూ ఒకేపార్టీలో ఉండటంతో దాని ప్రభావం జిల్లా పార్టీపై పడింది.

తాజాగా జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల నియామకం విషయాన్ని సమావేశంలో ప్రస్తావించగానే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మార్టూరు కమిటీ వ్యవహారాన్ని ప్రస్తావించారు.

పర్చూరుతోపాటు అద్దంకి నియోజకవర్గంతో కూడా ఈ కమిటీకి సంబంధముంది. కాగా.. అధ్యక్షుడిని నియమించుకునే అవకాశం తనకు ఇవ్వాలని ఏలూరి కోరారు.

వెంటనే జోక్యం చేసుకున్న బలరాం.. ‘ఆ కమిటీని మీరే వేసేసుకోండి. ఎక్కడ్నుంచో వచ్చిన వారు పెత్తనం చేయాలని చూస్తున్నారు. అన్ని పదవుల నియామకాలను ఆపేస్తున్నారు.

వారితో అంతా ఇబ్బందిగా ఉంది’.. అంటూ ఏడాదిన్నర క్రితం పార్టీలో చేరిన ఎమ్మెల్యే రవికుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వెంటనే వెనకెక్కడో కూర్చున్న గొట్టిపాటి రవి కుమార్ కమిటీతో తనకు ఏవిధమైన సంబంధం లేదని చెప్పారు. అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ ఆయన హెచ్చరించారు.

గొట్టిపాటి వ్యాక్యలు సహించలేని కరణం వెంటనే తాను కుర్చున్న కుర్చినీ ఎత్తుకుని గొట్టిపాటి వైపు దూకారు. దాంతో గొట్టిపాటి సైతం రా.. చూసుకుందామంటూ ఇంకో కుర్చి ఎత్తి కరణంవైపు దూసుకొచ్చారు.

జరుగుతున్న విషయాన్ని గమనించిన ఇతర నేతలు వెంటనే వారిని అడ్డుకున్నారు. అయితే, ఇద్దరు చాలా సేపు వెనక్కి తగ్గలేదు.

ఈ విషయం తెలిసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ హుటాహుటిన సమావేశ మందిరంలోకి వచ్చి ఇద్దరు నేతలకు సర్ది చెప్పి సమావేశాన్ని కొనసాగించారు.

మామాట:- నాయకులే ఇలా ఉంటే…. ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటో…..

Leave a Reply