పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Share Icons:
కొత్త ఢిల్లీ , జనవరి 8,
పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వచ్చే ముస్లింయేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ఆమోదించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల నడుమే ఈ బిల్లు ఆమోదం పొందింది.బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో మైనార్టీలు తీవ్ర హింసను ఎదుర్కొంటున్నారు. వారంతా ఆశ్రయం కోసం భారత్‌ వైపు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చింది.
అయితే ఇటీవలి కాలంలో ఇది వివాదాలకు దారితీసింది. దీనిపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు కేవలం అసోం రాష్ట్రం కోసం కాదు. పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చే శరణార్థుల అందరి కోసం. పశ్చిమ సరిహద్దుల నుంచి కూడా చాలా మంది శరణార్థులు రాజస్థాన్‌, పంజాబ్‌, దిల్లీ లాంటి రాష్ట్రాలకు వస్తున్నారు. ఆ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించడం కోసమే ఈ బిల్లును తీసుకొచ్చాం’ అని చెప్పుకొచ్చారు.
అయితే ఈ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ సవరణ వల్ల అసోంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని దీన్ని ఎంపిక కమిటీకి పంపించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. అయితే ఇందుకు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ నిరాకరించారు. దీంతో ప్రభుత్వం తీరును నిరసనగా కాంగ్రెస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
మామాట: దేశంలో ఉన్న రైతులకేమైనా చేయండయ్యా పాలకులారా….

Leave a Reply