జూన్‌ నుంచే పది కోట్ల టీకాలు అందిస్తాం… అమిత్ షాకు లేఖ రాసిన సీరమ్…

Share Icons:
  • ఆగస్టులో ఇస్తామన్న పది కోట్ల డోసులను జూన్‌లోనే ఇస్తామన్న సీరం
  • కేంద్రం నుంచి లభిస్తున్న మద్దతుకు థ్యాంక్స్ చెప్పిన సంస్థ
  • టీకా ఉత్పత్తికి సిబ్బంది 24 గంటలూ శ్రమ

కరోనా టీకాల కొరతతో ఇబ్బంది పడుతున్న దేశానికి ఇది ఊరటనిచ్చే వార్తే. జూన్‌లో 9 నుంచి 10 కోట్ల కొవిషీల్డ్ టీకాలు ఇస్తామంటూ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జూన్ నెల నుంచే 10 కోట్ల టీకాలు ఇస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. టీకాల ఉత్పత్తిని పెంచేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది.

కాగా, మేలో 6.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను మాత్రమే సీరం ఉత్పత్తి చేయగలిగింది. దీనిని దశల వారీగా పెంచుతూ ఆగస్టు, సెప్టెంబరు నాటికి నెలకు పది కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినట్టు గతంలో తెలిపింది. అయితే, అనుకున్న దానికి రెండుమూడు నెలల ముందుగానే 10 కోట్ల టీకాలను సరఫరా చేస్తామని చెప్పడం గమనార్హం.

విలువైన మార్గదర్శకత్వం, నిరంతర మద్దతు అందిస్తున్నందుకు అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సీరం అధికారి ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగస్టు, సెప్టెంబరులో 10 కోట్ల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని సీరం గతంలో ప్రకటించింది. అయితే, జూన్‌లోనే తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 కోట్లకు పెంచగలుగుతోంది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్. 

Leave a Reply