వర్మా….! సీమ సంస్కృతిలో రౌడీయిజం కనిపిస్తోందా…?

Share Icons:

ప్రాణమిచ్చే స్నేహం, ప్రేమ కనిపించలేదా..!
ఆదుకునే ధాతృత్వం చూడలేరా..!!

ఆహారం కోసం దాడి చేయడం చూశాం… నీటి కోసం పోట్లాడుకోవడం విన్నాం.. ఆస్తుల కోసం దండయాత్రలు కన్నాం… ఎక్కడైనా భాషను కాపాడుకోవడానికి మరో
భాషపైనా, సంస్కృతిపైనా దాడి చేయడం విన్నామా..? కన్నామా..? చూశామా..?

ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజమే ఆశ్చర్యంగానే ఉంటుంది. తెలియకుండానే రాయలసీమ భాష, రాయలసీమ సంస్కృతిపై దాడి చేశారు… చేస్తూనే ఉన్నారు. ఒకటి కాదు,
రెండు కాదు వందల సినిమాల ద్వారా ఇది జరుగుతూనే ఉంది. రాయలసీమపై టాలీవుడ్ మాఫియా దాడి కారణంగా సీమ సంస్కృతి మసకబారిపోతుంది. బ్రిటీష్ హయాం
నుంచే రాయలసీమపై దాడి చేస్తూనే ఉన్నారు. కనిపించని కోణంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అదే అదే సినిమా రంగం.

సహజంగా ప్రాంతానికో భాష, మండలానికో యాస ఉంటుంది. ఇది సహజం.. ఏ భాషకైనా వర్తిస్తుంది. అలాగని ఏ ఒక్క ప్రాంతానికో చెందిన భాషాసంస్కృతులను ఇతర ప్రాంతాలపై రుద్దడం సరియైన పద్దతి కాదు. అది కాకుండా ఇతర ప్రాంతాల సంస్కృతి సాంప్రాదాయలపై దాడి చేయడమంటే… అంతకంటే దారుణం మరోటి ఉండదు. ఇది ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే చెల్లు.. పరిశ్రమనే తన చెప్పుచేతుల్లో పెట్టుకున్న కొందరు దర్శక పుంగువలకు, సినీ రచనా నిపుణులకు మాత్రమే సాధ్యం. ఇతర ప్రాంతాల భాష, సంస్కృతిపై దాడి చేసి సినిమా థియేటర్లో నవ్వులు పూయిస్తున్నామని పైశాచిక ఆనందాన్ని పొందే శాడిస్టులు. తరతరాలుగా రాయలసీమ సంస్కృతిపై దాడి చేస్తూనే ఉన్నారు. నాటి రాంగోపాల్ వర్మ నేడు ఉండే మరో సినీ బర్మా వరకూ ఎవరికైనా ఓ మాస్ సినిమా కావాలంటే వారి చూపు రాయలసీమ మీదే పడుతుంది. రాయలసీమలో కత్తులు.. వేటకొడవళ్లు, రక్తం, మాంసపు ముద్దలు, ఆర్తనాదాలు మాత్రమే ఉంటాయన్నట్లు ఓ కట్టుకథ అల్లేస్తారు. మన సంస్కృతిపై విచ్చలవిడిగా దాడి జరిపేస్తారు. రక్త చరిత్ర అని, అంతపురమని, లేదా సమరసింహారెడ్డి అనో, ఏదోక పేరు పెట్టేసి సినిమా మొదలు.. శుభం కార్డు పడే వరకూ తెరను రక్తంతో అలికేస్తారు. కత్తులు.. బాంబుల శబ్ధంతో మన చెవులకు తుప్పు పట్టిస్తారు. ఇదే పదార్థంగా మరోమారు సీమపై దాడి చేయడానికి రామగోపాల్ వర్మ సిద్ధమయిపోయారు.

సీమ ప్రాంతంలో ప్యాక్షన్ తప్ప మరోటి లేదనే విధంగా సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే రాయలసీమ జిల్లాలలో ఉన్న ఫ్యాక్షన్ కుటుంబాలు ఎన్ని..? ఫ్యాక్షన్ వలన జరుగుతున్న హత్యలు ఎన్ని ? అని ఆలోచిస్తే కేవలం 2 శాతం కూడా ఉండవు. కానీ, ఇతర ప్రాంతాల వారు ఆ సినిమాలు చూస్తే రాయలసీమలో అందరూ అలాంటి వారే అన్నంత అసహ్యంగా చిత్రీకరణ జరిగి ఉంటుంది. కడప అనగానే బాంబులని, అనంతపురం, కర్నూలు జిల్లాలు అనగానే కత్తులు అన్నట్లు చిత్రీకరణలు జరిపుతారు. వాటిని నాలుగు సుమో.. పది వేట కొడవళ్ళు, నలుగురు యాక్టర్లకు తెల్ల బట్టలు వేసి సినిమాలో రక్తపాతం సృష్టించడం సినీ మాఫియకే చెల్లు.

శత్రువైనా ఇంటి ముందుకు వస్తే తాను కడుపునిండా తిన్న తరువాతే తాను భోజనం చేసే సంస్కృతి మీకు కనిపంచలేదా..? కష్టాల్లో ఉన్నవాడు తన ఇంటికి వచ్చి సాయం కోరితే, ఆ కష్టాలను తన కష్టాలుగా భావించి ఆపదల్లోంచి గట్టెక్కించిన సంఘటనలు మీరు ఎరుగరా..? ఈ సినిమాలా సీమకు సంస్కృతి నేర్పేది..? ఈ సినీమాఫియానా రాయలసీమకు సందేశాలిచ్చేది. మిగిలిన ప్రాంతాల వారికి సంస్కృతి అంటే ఏమిటో.. ప్రేమానురాగాలకు అర్థం తెలియని నాడే వాటిని రాయలసీమ గడ్డలో పెద్దలు పాదుగొల్పారు.

విజయవాడలో, గుంటూరులో, ఇతర ప్రాంతాలలో నేరాలు, ఘోరాలు జరుగలేదా? ఏనాడైనా చూపారా..? చూపరు.. చూపలేరు ? ఎందుకు? బెజవాడలో
ఫ్యాక్షన్ నడుస్తున్న విషయం మీకు తెలియదా..? మరి వాటిని ఎన్ని సినిమాల్లో చిత్రీకరించారు.? చిన్నపిల్లలను హత్యలు చేసిన సంఘటనలు, మహిళలపై లైంగిక
దాడులు జరిగిన సంఘనలు కోకొల్లలు. క్రైమ్ రేటు రాయలసీమ కంటే మిగిలిన ప్రాంతంలోనే అత్యధికంగా ఉందనేది పచ్చి నిజం. వాటిని ఎందుకు మరుగుపరుస్తున్నారు?

రాయలసీమ తప్ప మిగిలిన ప్రాంతాలలో పొలాలు, సెలయేర్లు, పిల్లగాలులు, సముద్రపు తీరప్రాంతాలు అహ్లాదకరమైన వాతావరణం అన్నట్లు చూపుతారు. అక్కడి పూతరేకులను పదే పదే సినిమాల్లో చూపుతూ మిగిలిన ప్రాంతాల నెత్తిన వేసి రుద్దడానికే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వేసే నిప్పట్లను ఏనాడైనా ముద్దపప్పు, నెయ్యితో కలిపి తిన్నారా..? సీమ రాగి సంగటి, శనగ్గింజ ఊరిమిండి ఏనాడైనా రుచి చూశారా…? అది ఇచ్చే మధురానుభూతి మీకు తెలుసా..? సినీ మాఫియానా రాయలసీమకు వంటలు నేర్పేది ? రాయలసీమ అనగానే గొడ్డుకారం అన్నట్లు చూపే మిమ్మల్ని ఏమనాలి ? రాయలసీమ జిల్లాలలో వర్షాకాలంలో కేసీ కాలువ కింద పంటలు, కడపలోని రాజుపాళెం పల్లెలు, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రాంతం, చిత్తూరు అనంతపురం మధ్యలోని హార్శిలీ హిల్స్ వంటి ప్రాంతాలు, తలకోన, కైలాసకోన, సదాశివకోన, గండికోట ఇవేవి మీకు కనిపించవా..? అక్కడ పల్లెల్లో చూపే ప్రేమానురాగాలను మీరేనాడైనా చవి చూశారా…?

మీరా పల్లెటూరి సంస్కృతిని నేర్పేది ? ఆయ్… యేటండీ..? వచ్చేత్తారా..? అయ్యబాబు… అయ్యబాబు… యేటండి ఇలాగైపోయారు….అనే ఒకే ప్రాంతపు యాసను భాషనే ఉన్నతమైన భాషగా చూపు ఇతర భాష, యాసలపై దాడి చేసే తత్వాన్ని మానుకోవాలి. సీమ పిలుపులో అనురాగం ఉంటుంది. మా యాసలో ఆప్యాయత ఉంటుంది. మా పలకరింపులో స్వచ్ఛత ఉంటుంది. వాటి చూపాలి. వీలైతే అన్ని ప్రాంతాల యాస భాషలను కలపే సినిమాలు అవసరం…తీయగలిగే సత్తా ఉంటే అవి తీయాలి. లేదంటే సీమ నుంచి సినిమా వ్యతిరేకతను ఎదుర్కొనే రోజులు ఎంతదూరంలో లేవు.

Leave a Reply