ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సి‌ఐ‌డి కేసులు: నాకేం తెలియదంటున్న ప్రత్తిపాటి

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి: గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అమరావతిలో చేసిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ వేగంగా సాగుతోంది. అందులో భాగంగా… ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. వారిలో ఒకరు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాగా… మరొకరు పి.నారాయణ. వీళ్లిద్దరూ… ఎస్సైన్డ్ భూములను కొన్నట్లుగా సీఐడీ చెబుతోంది. రూల్ ప్రకారం ఎస్సైన్డ్ భూములను ప్రభుత్వమే కొన్ని వర్గాలకు ఇస్తుంది కాబట్టి… వారి నుంచీ ఎవరూ వాటిని కొనకూడదు. కానీ వీళ్లు కొన్నట్లుగా సీఐడీ లెక్కలు చెబుతోంది. ఆ క్రమంలో వీళ్లపై కేసులు నమోదు చేసింది.

రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంకు చెందిన బుజ్జమ్మ అనే మహిళ.. తన 99 సెంట్ల భూమిని అప్పటి మంత్రులు బలవంతంగా లాక్కున్నాని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ముందుకుకదిలింది. ఇక కేసులు నమోదైనందు వల్ల టీడీపీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ ఇప్పుడు సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే దీనిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. సీఐడీ ఎఫ్ఐఆర్ లో రాసినట్లు బుజ్జమ్మ అనే మహిళ ఇంట్లోకి వెళ్లడం, బలవంతంగా భూమి కొనడం లాంటివేవీ తనకు సంబంధంలేదని, ఎవరో కొన్న భూములకు పేర్లు లింకప్ చేసి ఏ2, ఏ3గా పేర్కొనడం అన్యాయమని మాజీ మంత్రి పుల్లారావు చెప్పారు. బుజ్జమ్మ అనే పేరు కూడా వినలేదని, బహుశా ల్యాండ్ పూలింగ్ సమయంలో ఎవరింటికైనా వెళ్లుంటానో గుర్తులేదని, అయితే అసైన్డ్ భూములు కొన్నారన్న ఆరోపణ మాత్రం అవాస్తవమన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ అని పదే పదే చెబుతోన్న సీఎం జగన్.. అమరావతిలో భూములు కొన్న వైసీపీ నేతల పేర్లను మాత్రం తెలివిగా తప్పించారని, రాజారెడ్డి అనే వైసీపీ వ్యక్తి 190 ఎకరాలు కొనుగోలుచేసినా ఆయనపై విచారణ జరగడంలేదని మాజీ మంత్రి ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో గుమ్మడి సురేశ్ అనే వ్యక్తిని తన బినామీగా పేర్కొనడాన్ని పుల్లారావు ఖండించారు. సురేశ్ తో పరిచయంగానీ, లావాదేవీలుగానీ లేవన్నారు. అక్రమ కేసులు పెట్టినంతమాత్రాన, టీడీపీ నేతల నోళ్లు మూయించినంతమాత్రాన రాజధాని ఉద్యమం ఆగిపోదని అన్నారు.

 

Leave a Reply