చోడవరంలో ఈ సారి వైసీపీ జెండా ఎగిరేనా?

Share Icons:

విశాఖపట్నం, 5 ఏప్రిల్:

విశాఖ రూరల్‌ ప్రాంతంలో ప్రధాన నియోజక వర్గాల్లో చోడవరం ఒకటి. నియోజకవర్గం వ్యవసాయాధారిత ప్రాంతం. రైతుల సమస్యలే ఇక్కడ ప్రధాన ప్రచారాస్త్రం. టీడీపీకి పట్టుగొమ్మ లాంటి నియోజకవర్గంలో 2009, 2014 ఎన్నికలో ప్రస్తుత వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చారు. అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతోనే గట్టెక్కగలిగారు.

ఆ ఇద్దరు అభ్యర్థులే ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. ఈ సారి భారీ ఓట్ల తేడాతో విజయం కోసం సిటింగ్‌ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.రాజు వ్యూహం రచిస్తున్నారు. నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో జరిగిన అభివృద్ధి పనులు, చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చోడవరంలో ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారుల నుంచి తనకు ఓట్ల వర్షం కురుస్తుందని రాజు ధీమాగా ఉన్నారు.

మరోవైపు ఈసారి ఎలాగైనా విజయతీరం చేరాలని కరణం ధర్మశ్రీ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి, నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోవడం, గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ నష్టాలబాట పట్టడం వంటి అంశాలతోపాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని కరణం ధర్మశ్రీ నమ్మకంతో ఉన్నారు. కాగా జనసేన తరపున పీవీఎన్‌ఎస్‌ రాజు, బీజేపీ నుంచి మొల్లి వెంకటరమణ, కాంగ్రెస్‌ తరపున గూనూరు వెంకటరావు పోటీ చేస్తున్నారు. అయితే అసలు పోరు టీడీపీ-వైసీపీల మధ్య జరుగుతుంది.

మామాట: ఈ సారి వైసీపీనే పాగా వేసేలా ఉంది..

Leave a Reply