టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత…టీడీపీ శ్రేణులు ద్రిగ్భ్రాంతి

Chittoor former MP N Shiva Prasad passes away at 68
Share Icons:

చిత్తూరు: టీడీపీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణించి వారం రోజులు కాకమునుపే….మరో సీనియర్ నేత కాలం చెల్లించారు. టీడీపీ మాజీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్(68) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం 2:07 గంటలకు శివప్రసాద్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. శివప్రసాద్ ఇకలేరన్న విషయం తెలుసుకున్న అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు.

శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి. 1951 జూలై 11న నాగయ్య, చెంగమ్మ దంపతులకు నాటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఇక్కడే ప్రస్తుత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ మంచి ఆప్తులుగా ఉన్నారు. శివప్రసాద్ పలు సినిమాల్లో కూడా నటించారు. ఇదిలా ఉంటే.. 2009, 2014 టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసి శివప్రాద్ విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో ఓడిపోయారు.

శివప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా చిరకాల మిత్రుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం విచారకరం. ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం ఆయన రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు’ అని వ్యాఖ్యానించారు. శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం టీడీపీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. అటు టీడీపీ శ్రేణులు కూడా శివ ప్రసాద్ మృతి పట్ల ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a Reply