చీరాల రచ్చ: పోటాపోటిగా నామినేషన్లు వేసిన కరణం, ఆమంచి వర్గీయులు

Share Icons:

చీరాల: కరణం బలరాం వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడమే చీరాల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. అయితే కరణం చేరి 24 గంటలు గడవక ముందే నియోజకవర్గంలో ఆమంచి వర్సెస్ కరణంగా పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చీరాల వైసీపీలో పోటాపోటీ నెలకొంది. ఒక్కో మున్సిపల్‌ వార్డుకు ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయుల పోటాపోటీగా నామినేషన్లు వేశారు.

అయితే ఫైనల్‌గా బీఫారం ఎవరికి ఇస్తారో అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. సాయంత్రం వరకు వేచి చూసే ధోరణిలో వైసీపీ నేతలు ఉన్నారు. పోటాపోటీ నామినేషన్లతో వైసీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మరి ఈ విషయంలో జిల్లా మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలో హర్షవర్ధన్ ఉన్నారని, దీంతో జేసీని కాసేపటి తర్వాత పంపిస్తామని పోలీసులు చెప్పారు.

ఈ నేపథ్యంలో అక్కడే జేసీ, హర్షవర్ధన్‌ వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం పెరిగిపోవడంతో అక్కడి నుంచి ఇరు వర్గాల వారిని పోలీసులు పంపించారు. మరోవైపు తాడిపత్రిలో నామినేషన్‌ వేసి తిరిగి వెళ్తుంటే తమను వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బెదిరించారంటూ టీడీపీ నేత జింకా లక్ష్మీదేవి నిరసనకు దిగారు. ఆమె అక్కడి 36వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా నామినేషన్‌ వేశారు.

అటు అనంతపురం జిల్లా ధర్మవరంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న  టీడీపీ అభ్యర్థులను వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 27వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రమీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను వైసీపీ నేతలు చించివేశారు. కళ్లెదుటే నామినేషన్ పత్రాలను చించివేస్తున్న పోలీసులు పట్టించుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a Reply