ప్రపంచమంతా ఉచిత వైఫై అంటా…!

Share Icons:

బీజింగ్, 30 నవంబర్:

ఈరోజుల్లో అన్ని పనులు ఇంటర్నెట్ మీదే ఆధారపడే జరుగుతున్నాయి. ఒక్క క్షణం ఇంటర్నెట్ ఆగిపోతే ప్రపంచమే స్తంబించి పోతుంది. అయితే ఈ ఇంటర్నెట్ రావాలంటే మొబైల్ నెట్‌వర్క్‌, వైఫైల ఛార్జీలు ద్వారా వస్తుంటుంది.

అయితే ఈ చార్జీల గోల లేకుండా ఎక్కడుంటే అక్కడ ఫ్రీ వైఫై దొరికే అవకాశం త్వరలో రాబోతుంది. చైనాకు చెందిన ఓ సంస్థ ప్రపంచమంతా ఫ్రీ వైఫై ఇచ్చేందుకు భారీ ప్రణాళికలే చేస్తోంది. దీని కోసం ఏకంగా రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.

షాంఘాయ్‌కి చెందిన లింక్‌ష్యూర్ నెట్‌వర్క్ ప్రపంచమంతా ఉచితంగా వైఫై అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏకంగా 272 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. వాటి సాయంతో ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా వైఫై ఇవ్వొచ్చు.

అయితే ఇది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కాదు. 2020 లోగా 10 ఉపగ్రహాలు, 2026 నాటికి 272 ఉపగ్రహాలను పంపనున్నది. అయితే ఇలా ఉచితంగా వైఫై ఇవ్వాలన్న ఆలోచన కొత్తేమీ కాదు. గతంలోనే గూగుల్, స్పేస్-ఎక్స్ లాంటి సంస్థలు కూడా ఫ్రీ వైఫై ప్రాజెక్టు పనుల్లో ఉన్నాయి.
మామాట: మరి ప్రాజెక్టు ఎంతవరకు అమల్లోకి వస్తుందో చూడాలి…

Leave a Reply