జై భవాని — వీర శివాజి  

Share Icons:

జై భవాని — వీర శివాజి  

భారతదేశంలో పరంపరాగతంగా వస్తున్న అనేక శక్తివంతమైన సామ్రాజ్యాలను కూలగొట్టి, భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని కంకణం కట్టుకొని మరీ ప్రయత్నించిన మొగలుల నుంచీ హిందూ ధర్మ రక్షణకు,  దేశాన్ని హిందూదేశంగా మిగిల్చేందుకు అవిశ్రాంత పోరాటం చేసినవాడు ఛత్రపతి శివాజి. శివాజి దండయాత్రలు, దుర్గాల ముట్టడి, శత్రు శిబిరాల్లో పరాక్రమ ప్రదర్శన లాంటి వీరోచిత కృత్యాలన్నీ జనం నోళ్ళల్లో కథలు, గాథలుగా అల్లుకుపోయాయి.

శివాజీ క్రీ.శ. 1627వ సంవత్సరం ఫిబ్రవరి 19, వైశాఖమాసపు శుక్లపక్ష తదియన పూణే జిల్లా జున్నార్ దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. జిజియాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది. తల్లి జిజియాబాయి జన్మభూమి, ప్రజల ప్రేమ కలిగేట్లు కలిగేట్లు పెంచి విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం శివాజీ తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా  వ్యూహాలు మొదలు పెట్టాడు.

 ‘రాయఘడ్‌’ రాజధానిగా  స్థాపించిన సామ్రాజ్యంలో ఎన్నో సంస్కరణలు కార్యరూపం ధరించాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, వాళ్ళని పెత్తందారుల ఆగడాల నుంచి బయట పడెయ్యడం కోసం ఆయన ఎన్నో  కార్యాలు నిర్వహించాడు. సైన్యాన్ని, నావికదళాన్ని నిర్మించాడు. దుర్గాలని పటిష్ట పరిచాడు. అక్షరాస్యత వ్యాప్తికి నడుంకట్టాడు. పరిపాలనా భాష సంస్కరించాడు. రాజ వ్యవహారం కోశం అనే నిఘంటువు తయారు చేయించాడు. శిక్ష్మాస్మృతి సమన్యాయంతో అమలుచేశాడు. మొత్తం మీద ”ప్రజల మనిషి” అని ప్రజల మన్నన పొందాడు. శివాజికి ముస్లింమత విద్వేషం యేమాత్రం లేదు. ఔరంగజేబ్‌తో పోరాడినా తన కొలువులో, సైన్యంలో ముస్లింలని యే శంకలూ లేకుండా నియమించాడు. ఆయన విశాలదృక్పథం, ఏ ఒక్క మతానికి సంకుచితం కాకుండా ఆయన్ని మహనీయుణ్ణి చేసింది.

మహారాష్ట్ర, మధ్యభారత్ ప్రాంతాలలో ఒక ప్రక్క సమర్థ రామదాసస్వామి, మరోప్రక్క ఛత్రపతి శివాజి చేసిన కృషి ఫలితంగా ఈ దేశం ప్రాచీన హిందూ సంస్కృతి  దేశంగా నిలద్రొక్కుకో గలిగింది. శివాజి తన సైనికుల ముందు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంచాడు. లక్ష్యసాధనకు విశేష కృషి చేసాడు. ‘హైందవీ స్వరాజ్’ను సాధించడమే శివాజి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం వేలమంది సుశిక్షిత సైనికులను తయారు చేసుకొన్నాడు. దానికోసం స్వదేశీ రాజులతో యుద్ధం చేయవలసి వచ్చినా  వెనుకాడలేదు.  సైనికులలో కూడా క్రమశిక్షణా రాహిత్యాన్ని అంగీకరించక పోగా కఠినంగా శిక్షించేవాడు.

శివాజి సైనికులలో రాజభక్తి కంటే ‘హైందవీ స్వరాజ్’ సాధించే సంకల్పం ఎక్కువగా కనబడేది. దాని కారణంగానే శివాజి అద్భుత విజయాలు సాధించాడు. శివాజి సాగించిన పోరాటం అద్భుతం. ఒక ప్రక్క బహ్మనీ సుల్తాన్ లు, రెండవ ప్రక్క మొగలులు ఇరువురితో పోరాటం సాగింది. శివాజి సామ్రాజ్యాన్ని నాశనం చేయటానికి శివాజి చనిపోయిన తరువాత కూడా ప్రయత్నాలు కొనసాగాయి. ఔరంగజేబు 25 సంవత్సరాల పాటు ఢిల్లీని వదలి వచ్చి మహారాష్ట్రలో తిష్ట వేసి శివాజి సైనికులతో పోరాటం చేసాడు. చివరకు శివాజి సైన్యం ధాటికి తట్టుకోలేక వెన్ను చూపి పారిపోయాడు. ఇదంతా మొగలులపై శివాజి సాగించిన ధర్మయుద్ధం. ఎటువంటి శత్రవుతో ఎట్లా వ్యవహరించాలో కూడా శివాజి నేర్పించాడు.

సమాజంలో స్వాభిమానం జాగృతం చేసినవాడు శివాజి. వందల సంవత్సరాలుగా ఇస్లాం ఆక్రమణలో ఉన్న భారతదేశంలో ఎవరూ సామ్రాట్ గా పట్టాభిషేకం చేసుకోలేదు. శివాజి సామ్రాట్ గా పట్టాభిషేకం చేసుకొన్నాడు. శివాజి 1674 సంవత్సరం జూన్ 6వ తేదీన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారం “క్షత్రియ కులావతంసా సింహాసనాధీశ్వర మహారాజ:” అంటూ జరిగిన కీర్తనలమధ్య శివాజి పట్టాభిషేకం అత్యంత వైభవంగా, ఘనంగా, కన్నుల పండువలా జరిగింది. అప్పుడప్పుడే భారత్ లో ప్రవేశిస్తున్న ఐరోపా దేశాల వారిపై కన్ను వేసి ఉంచవలసిన అవసరం ఏర్పడింది. వారి ఆగడాలను అరికట్టడంలో కూడా శివాజి విజయం సాధించాడు. అష్ట ప్రధానులతో చక్కటి ధర్మబద్ధ పాలనను ప్రజలకు అందించాడు.

యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం,పటిష్టమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు. సుధీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.

మతసామరస్యానికి ఆయన ప్రతీక. శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి , ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్  ఇద్దరు ముస్లింలు! శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్‌ కూడా ముస్లిమే!

భారతదేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో తిలక్ మహాశయుడు శివాజి జయంతి ఉత్సవాలను నిర్వహించి ప్రజలను జాగృతపరిచాడు. 1680 ఏప్రిల్ 3న ఆయన రాఘడ్ కోటలో కనుమూసారు.

శివాజి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్లు విధించిన ‘గృహ నిర్బంధం’ నుండి బయటపడి జర్మని చేరి, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటే  జపాన్ కేంద్రంగా భారత స్వాతంత్ర్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించి ఆంగ్లేయులపై యుద్ధం సాగించాడు. ఇలా శివాజి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. అమెరికాతో జరిగిన యుద్ధంలో తమకు విజయం లభించటానికి స్ఫూర్తి శివాజి జీవితమే అని వియత్నాం చెప్పుకొన్నది. శివాజి హిందూ సమాజం, హిందూ ధర్మ రక్షణకు సాగించిన పోరాటం బ్రిటిష్  రాజ్యం సాగుతున్న కాలంలో ఎక్కువగా  సాగలేదు. బ్రిటిష్ వారు ఈ దేశ చరిత్రను, ఈ దేశ ఆదర్శాలను నాశనం చేసే ప్రయత్నం చేసారు. ఈ దేశంలో పాశ్చాత్య ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసారు. అందులో సెక్యులరిజం వచ్చింది. భారతదేశంలో నేడు చైతన్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. సమాజం జాగృతమౌతున్నది. శివాజి వ్యవహార శైలిని ఆదర్శంగా  చేసుకుని సమాజం చైతన్యం కావడానికి యత్నిస్తున్నది. ఆ వీరపుత్రుని మార్గదర్శకునిగా చేసుకుని నేటి దేశయువత అకుంఠిత దీక్షతో అడుగులు వెయ్యాలి.

-భరద్వాజ 

Leave a Reply