బాబు మళ్ళీ పాత మిత్రులకు దగ్గరవుతున్నారా….!

chandrababu tries to close old friends janasena and bjp
Share Icons:

అమరావతి:

తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది 2019లోనే. ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి 175 సీట్లకి పోటీ చేసి 23 సీట్లని మాత్రమే గెలుచుకుంది. ఇక వైసీపీ 151 సీట్లు గెలుచుకుని జగన్ సీఎం అయిపోయారు. అయితే ఓటమి తర్వాత టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది. ఆ పార్టీని ముఖ్య నేతలు వీడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆలోచనలో పడిపోయారు. ఇలాగే ఉంటే పార్టీ వచ్చే ఎన్నికల నాటికి బలపడదని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకనే 2014లో కలిసి పోటీ చేసిన పాత మిత్రులకు బాబు దగ్గర అవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ కలిసి పొత్తులో పోటీ చేశాయి. వీరికి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ మద్ధతు ఇచ్చింది. దీంతో టీడీపే మెజారిటీ సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే టీడీపీ అవినీతికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ గళం విప్పి వారికి దూరంగా జరిగారు. ఇక ఎన్నికల ముందు టీడీపీ-బీజేపీ పొత్తు తెగిపోయింది. ఫలితంగా తాజా ఎన్నికల్లో మూడు పార్టీలు వేరు వేరుగా పోటీ చేశాయి. టీడీపీ 23 సీట్లు గెలుచుకుంటే జనసేన 1 సీటు గెలుచుకుంది ఇక బీజేపీ అయితే ఒక్కశాతం ఓట్లు కూడా తెచ్చుకోలేదు కానీ కేంద్రంలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

అయితే ఏపీలో చాలామంది టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. అలాగే చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నేతలు కూడా బీజేపీలో చేరారు. వీరి చేరిక వెనుక కూడా చంద్రబాబు వ్యూహమే ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. చంద్రబాబుకు రైట్ – లెఫ్ట్ హ్యాండులుగా నిలిచిన సుజనా చౌదరి – సీఎం రమేశ్ లాంటి వారే బీజేపీలో చేరిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య విరోధం తగ్గినట్లు అనిపిస్తోంది. ఇక అటు జనసేనకు కూడా బాబు దగ్గరవుతున్నారు. పవన్ ని ఇప్పటి నుంచి మచ్చిక చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఉపయోగపడతాడని అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పవన్ బర్త్ డేను పురస్కరించుకుని చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ ను వదిలారు. సదరు ట్వీట్ లో చంద్రబాబు చేసిన కామెంట్లను చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం  వేయక మానదు. ‘తెలుగు సినీ నటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించి – విశిష్ట వ్యక్తిత్వంతో ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’ అని ఆ ట్వీట్ లో చంద్రబాబు… పవన్ కు ఓ రేంజిలో గ్రీటింగ్స్ చెప్పారు. దీని బట్టి చూస్తుంటే బాబు పవన్ కు దగ్గరవ్వాలని తెలిసిపోతుంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలనాటికి పాత మిత్రులతో కలిసి బాబు ముందుకెళ్లతారని అర్ధమవుతుంది.

 

Leave a Reply