చంద్రబాబు సంచలన నిర్ణయం: వైసీపీ బాధితులకు పునరావాస కేంద్రం..

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

అమరావతి:

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజుయ ఆయన ప్రధాన నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల తరువాత, వైసీపీ నేతలు, కార్యకర్తల దాష్టీకాలు పెరిగిపోయాయని, వారి దాడుల కారణంగా నష్టపోయిన వారి కోసం గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటన చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు, గుంటూరులోని అరండల్ పేటలో పునరావాస కేంద్రం ఉంటుందని, ఎవరైనా ఇక్కడకు వచ్చి ఉండవచ్చని, వారందరికీ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

ఇక గడచిన మూడున్నర నెలలుగా రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, హత్యలు, ఆస్తుల విధ్వంసానికి లెక్కే లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూముల కబ్జాలు, దాడులు, వేధింపులు, అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అయితే పునరావాస కేంద్రానికి వచ్చే వారికి అన్ని సౌకర్యాలనూ దగ్గర చేస్తామని, పరిస్థితులు కుదుట పడేవరకూ వారు ఇక్కడే ఉండవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక బాధితులంతా గుంటూరు శిబిరానికి తరలి రావాలన్నారు. అవసరమైతే తానే స్వయంగా బాధితులను వాళ్ల గ్రామాలకు తీసుకుని వెళతానన్నారు. జిల్లా పార్టీ నాయకులు అందరిని సమన్వయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇక ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అందరికీ ఉందని, కానీ ఆ హక్కులను ప్రభుత్వమే కాలరాయాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు కూడా విఫలం అవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల విషయంలో పోలీసులు కూడా నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారని, బాధితులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చికొడితే ఎక్కడో పడిన చంద్రబాబు హెచ్చరికలు ఒకేలా ఉన్నాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కేవలం 3 నెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని చంద్రబాబు చెబుతున్నారని దుయ్యబట్టారు. అర్జంటుగా కుర్చీని ఖాళీ చేయాలని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.

 

Leave a Reply