విద్యార్ధులని రాజధాని ఏదని అడిగితే ఏం చెబుతారు?

tdp president chandrababu sensational comments on jagan
Share Icons:

అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష టీడీపీ పోరాడుతున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతిలోనే ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ 24 గంటల నిరాహార దీక్షకు దిగడంతో ఆయనకు సంఘీభావం తెలపడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువతకు భవిష్యత్తు ఉండాలంటే రాజధాని ఉండాలి. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తే మీ రాజధాని ఏదని వారిని అడిగితే మూడు రాజధానుల పేర్లు చెప్పడానికి సిగ్గుపడతారు. ఒకవేళ విద్యార్థులు తమ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయని చెబితే.. మూడు రాజధానులు ఏంటయ్యా? అని వారిని ఎగతాళి చేస్తారు. మన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లకూడదనే అమరావతికి శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని గురించి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు.

అలాగే తాను ఇటీవల అమరావతిలో పర్యటించడానికి వస్తే బస్సుపై కర్రలతో, చెప్పులతో దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయవచ్చని  డీజీపీ అన్నారు. మరి అమరావతి రైతులు నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? ఇటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. ఓ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు.

అలాగే రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం కమిటీలపై కమిటీలు వేస్తూ.. ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మరోవైపు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని, దానిపై న్యాయ విచారణ జరపాలని కూడా చెబుతున్నామని, తప్పు జరిగినట్లు నిర్ధారణ జరిగితే శిక్షించాలన్నారు. అంతేకాని, ఇన్‌సైడర్ పేరు చెప్పుకుని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని ప్రాంతాలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని చెబుతున్నాయని, ఇప్పటికైనా సీఎం జగన్‌కు జ్ఞానం రావాలన్నారు.

ఇక అనంతరం పలువురు నేతలు, రైతులు  అమరావతి రాజధాని పరిరక్షణ సమితి కోసం చంద్రబాబుకు తమకు తోచిన విధంగా నగదును విరాళంగా అందించారు. ఓ మహిళ తన బంగారు గాజులను తీసి ఆయనకు విరాళంగా అందించింది. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు ప్రశంసించారు. రైతులు ఎన్నో త్యాగాలు చేసి భూములు ఇస్తే, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు రాజధానిని తరలిస్తాననడం సరికాదని ఆయన విమర్శలు గుప్పించారు.

 

Leave a Reply