అధికారిణిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం: సీఎంకు ఇవేమీ కనపడవా?చంద్రబాబు

chandrababu comments on ap govt
Share Icons:

అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లూరిపల్లిలో ఉన్న సరళ ఇంటి వద్దకు వెళ్లిన కోటంరెడ్డి… నీటి పైపు లైను ధ్వంసం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కేబుల్ వైర్ ను కట్ చేశారు. ఈ నేపథ్యంలో, తన ఇంటిపై దాడి చేసి, తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలపై సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మొదట ఆమె కేసుని తీసుకోడానికి పోలీసులు సంకోచించారు. కానీ ఆమె అక్కడే ఆందోళన చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే దీనిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. నిజాయితీగా ఉన్న మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని, న్యాయం కోసం మహిళా అధికారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కేసు తీసుకోవడానికే జంకారంటే పోలీసింగ్ ఉన్నట్టా? లేనట్టా? అని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళా అధికారులని కూడా చూడరా?, ఆ అధికారి ఇంటికి కరెంట్ నీటి కనెక్షన్‌ను కట్ చేస్తారా? అని మండిపడ్డారు.

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఉంటే సీఎంకు ఇవేమీ కనపడవా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జర్నలిస్టును చంపుతానని ఫోన్లో బెదిరించాడని, మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని అన్నారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని చంద్రబాబు నిలదీశారు.

అధికారిణిని వైసీపీ ఎమ్మెల్యే హింసిస్తుంటే… రాష్ట్ర అధికారులు, ఎంపీడీవో సంఘాలు ఏమి చేస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో గగ్గోలు పెట్టిన సంఘాలు… శ్రీధర్ రెడ్డికి భయపడ్డాయా? అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ ఎదుట దీనంగా కూర్చున్న ఎంపీడీవో సరళను మానసిక క్షోభకు గురి చేసిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీధర్ రెడ్డి దౌర్జన్యాలు సీఎం దృష్టికి ఎందుకు రావడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. మీ సమాచార వ్యవస్థ అంత బలహీనంగా ఉందా? అని అడిగారు. టీడీపీ నేత చింతమనేనికి ఒక న్యాయం… మీకు అస్మదీయుడైన శ్రీధర్ రెడ్డికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు.

 

Leave a Reply