ధర్మవరం బాధ్యతలని ఆ కుటుంబానికే అప్పగించిన చంద్రబాబు….

Share Icons:

అనంతపురం:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఇన్ చార్జ్ గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి )టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దీంతో ధర్మవరంలో టీడీపీ పరిస్తితి నాయకుడు లేని నావ లాగా తయారైంది.

 

దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పజెబుతున్నామని అనంతపురం పర్యటన సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. కార్యకర్తల సమక్షంలోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.

 

రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలు పరిటాల కుటుంబానికే ఇస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఇందులో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ ఎవరు ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారో వారి నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

 

పరిటాల సునీత కుటుంబ సభ్యులతో చర్చించి ఎవరు ఎక్కడ ఇన్‌చార్జిగా ఉండాలో తెలియజేస్తామని చెప్పడంతో ధర్మవరానికి వారిరువురిలో ఎవరు బాధ్యత వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. అయితే కొద్దిరోజుల క్రితం ధర్మవరం నాయకులతో సమావేశమైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ… పరిటాల కుటుంబానికే ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది.

Leave a Reply