సీబీఐ ఎంక్వైరీపై బాబు రూటు మార్చారా?

Share Icons:

అమరావతి: టీడీపీ సీనియర్  నాయకుడు కోడెల శివప్రసాద్ సోమవారం ఆత్మాహత్య చేసుకుని తనువు  చాలించిన  విషయం  తెలిసిందే. అయితే కోడెల ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనపై అనేక కేసులు పెట్టి ఒత్తిడికి గురి చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అడిగేవాళ్లు లేరని ఆంబోతుల్లా తయారయ్యారని ఆయన వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఊరిమీద పడి తొక్కుతామంటే ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు.

అలాగే కోడెలపై పెట్టిన పలు కేసులు గురించి ఆయన స్పందిస్తూ..అవన్నీ కక్షపూరితంగానే పెట్టారని ఆరోపిస్తున్నారు. అలాగే కోడెల తనయుడు శివరాం విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టారని, శివరాం ఇక్కడ ఉండి ఉంటే ఆయనే చంపాడని కేసులు పెట్టి, అరెస్ట్‌ చేసేవాళ్లని అన్నారు. శివరాం కొట్టాడనే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని సాక్షిలో ప్రచారం చేశారని,  వీసా తెప్పించి మేం రుజువు చేసుకోవాలా?. వివేకా హత్య జరిగితే, గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. ఇది నేరస్తుల రాజ్యం, రేపు నాపైనా కేసులు పెడతారని చెప్పుకొచ్చారు.

కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించరన్నారు. రెండునెలల్లో జగన్ ప్రభుత్వం కోడెలపై 19కేసులను నమోదు చేసిందన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోడెలకు వ్యతిరేకంగా కేసులు పెట్టాలని ప్రచారం చేశారన్నారు. కోడెలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందని, ఈ అంశంపై చర్చ జరగాలన్నారు. తనపైన గతంలో 26 కేసులను నమోదు చేసి రుజువు చేయలేకపోయారన్నారు.

అయితే మొన్నటివరకు అధికారంలో ఉన్న చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వకుండా జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి…ఏపీలో సీబీఐని బ్యాన్ చేశారు. అప్పుడు అలా చేసిన చంద్రబాబు ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషుకులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కోడెల మీద ఉన్న కేసులతో పాటు…వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు డిమాండ్ పై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Leave a Reply