వ్యవస్థలను మేనేజ్ చేయగలరు  ప్రజలను మేనేజ్ చేయలేరు: చంద్రబాబుపై బొత్స వ్యాఖ్యలు

Share Icons:
  • టీడీపీ మహానాడుపై బొత్స స్పందన
  • ఆత్మస్తుతి, పరనిందలా సాగుతోందని విమర్శలు
  • సీఎంపై బురదజల్లడమే పని అని ఆరోపణ
  • ఓటుకు నోటు కేసును కూడా ప్రస్తావించిన బొత్స
  • ప్రజలను మేనేజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఓడిపోయారని వెల్లడి

టీడీపీ మహానాడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీడీపీ మహానాడు నిండా ఆత్మస్తుతి, పరనిందలే సాగాయని విమర్శించారు. తమ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా చంద్రబాబునాయుడికి ఇదే పనిగా మారిపోయిందని అన్నారు. మహానాడు ద్వారా తీర్మానాలు అంటూ ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బొత్స… ఓటుకు నోటు కేసు అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించిన మీడియా కథనాల్లో చంద్రబాబు గురించి ఎక్కడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. చంద్రబాబు ఈ కేసులో అడ్డంగా బుక్కయ్యారని, ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ అనడం దేశం మొత్తం చూసిందని తెలిపారు. ఆడియో టేప్ లో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ నివేదికలోనూ స్పష్టమైందని బొత్స తెలిపారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు ప్రజలను మేనేజ్ చేయలేరని అభిప్రాయపడ్డారు. ప్రజలను మేనేజ్ చేసే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు దారుణ ఓటమికి గురయ్యారని తెలిపారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply