ఇద్ద‌రు చంద్రుల క‌థ‌!

Share Icons:

ఇద్ద‌రు చంద్రుల క‌థ‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబునాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుల గ‌మ్యం ఎటు? ప‌్ర‌స్తుతం ముఖ్య‌మంత్రులుగా ఉన్న ఈ ఇద్ద‌రు రానున్న రోజుల్లో జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తారా? ప‌్ర‌వేశిస్తే ఇద్ద‌రి పాత్ర ఏమిటి? ప‌్ర‌స్తుతానికి అయితే మాత్రం తాము రాష్ట్రాన్ని వ‌దిలి జాతీయ స్థాయికి వెళ్లేది లేద‌నే ఇద్ద‌రూ చెబుతున్నారు. హైద‌రాబాద్‌లో విమానం ఎక్కితే ఢిల్లీ వెళ్లి సాయంత్రానికి వ‌చ్చేయ‌చ్చు అని కెసిఆర్ అన్యాప‌దేశంగా తాను జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేది లేద‌ని చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌దిలి తాను జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేది లేద‌ని చంద్ర‌బాబు కూడా ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ముందుగా మూడో ఫ్రంట్ గురించి ప్ర‌స్తావించింది తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు కాబ‌ట్టి ఆయ‌న గురించి ముందుగా విశ్లేషించుకుందాం. జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కాకుండా మూడో ప్ర‌త్యామ్నాయానికి వీలు ఉందా అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

అలా మూడో ప్ర‌త్యామ్నాయ‌నికి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితిలో కూడా వీలు ఉంటే అది గ‌తంలో జ‌రిగిన ప్ర‌యోగాల‌కు భిన్నంగా ఎలా ఉండాలి అనేది అతి ముఖ్య‌మైన ప్ర‌శ్న‌. గ‌తంలో ఈ విధ‌మైన ప్ర‌యోగాలు చాలా వ‌ర‌కూ జ‌రిగాయి. అటు కాంగ్రెస్ వైపో ఇటు బిజెపి వైపో వెళ్ల‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేని ప‌రిస్థితి మూడో ప్రత్యామ్నాయానికి గ‌తంలో ఏర్ప‌డింది.

లేదా కాంగ్రెస్ మ‌ద్ద‌తు కానీ బిజెపి మ‌ద్ద‌తు కానీ తీసుకోవాల్సిన ప‌రిస్థితి కూడా ఏర్ప‌డింది. వీట‌న్నింటిని కాద‌ని మూడో ప్ర‌త్యామ్నాయం అధికారంలోకి రావాల్సి ఉంటుంది. అందుకు స‌హ‌క‌రించే పార్టీలు దేశంలో ఎన్ని ఉన్నాయి? అవి ఏమిటి?

చాలా కాలం నుంచి దేశంలో రెండు పార్టీల వ్య‌వ‌స్థ కోసం బిజెపి ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. జాతీయ స్థాయిలో రెండు పార్టీలే ఉంటే బిజెపికి ఎంతో మేలుక‌లుగుతుంది. మూడో ప్ర‌త్యామ్నాయం కోసం గ‌తంలో జ‌రిగిన ప్ర‌య‌త్నాల‌న్నీ కూడా వీగిపోవ‌డానికి ప్ర‌ధానంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలే కార‌ణం.

గ‌తంలో మూడో ప్ర‌త్యామ్నాయం ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌పుడు క‌మ్యూనిస్టు పార్టీలు బ‌లంగా ఉండేవి. ఇప్పుడు క‌మ్యూనిస్టు పార్టీలు అత్యంత బ‌ల‌హీనంగా మారి ఉన్నాయి. అందువ‌ల్ల మూడో ప్ర‌త్యామ్నాయం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుంద‌నేది ప్ర‌శ్నార్ధ‌క‌మే.

దేశం మొత్తంలో అటు కాంగ్రెస్ వైపు గానీ ఇటు బిజెపి వైపు కానీ, వామ‌ప‌క్షాల వైపు గానీ వెళ్ల‌కుండా ఉండ‌గ‌లిగేది తెలంగాణ‌లో కెసిఆర్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీలు మాత్ర‌మే. మూడో పేరు క‌నిపించ‌దు. ఎటూ వెళ్ల‌కుండా గిరిగీసుకుని కూర్చుంటే ఇప్పుడు జ‌రిగే ప‌ని కాదు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన పార్టీలైన స‌మాజ్‌వాది, బ‌హుజ‌న స‌మాజ్ పార్టీలు కాంగ్రెస్‌తో క‌లిసి వెళ‌తాయి.

బీహార్‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుతారు. మ‌హారాష్ట్ర‌లో శ‌ర‌ద్‌ప‌వ‌ర్ వీలైతే కాంగ్రెస్ వైపే వెళ‌తారు త‌ప్ప మ‌రెక్క‌డికి వెళ్ల‌రు. త‌మిళ‌నాడులో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌లో బిజెపి అనూకూల వ‌ర్గాలు ఇప్పుడిప్పుడే త‌లెత్త‌తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న ఎఐఏడిఎంకె, డిఎంకెలు ఒక‌రు అటుంటే మ‌రొక‌రు ఇటుంటారు. చాలా రాష్ట్రాల‌లోని ప్రాంతీయ పార్టీల వ్య‌వ‌హారం ఇంతే.

బిజెపి వైపు మొగ్గు చూపే శివ‌శేన‌

మ‌హారాష్ట్ర‌లోని శివ‌సేన ఒంట‌రిగా పోటీ చేయాల్సిందే త‌ప్ప కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల‌తో వెల్ల‌లేదు క‌దా? ఇలాంటి పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. అందువ‌ల్ల మూడో ప్ర‌త్యామ్నాయం రావడం, వ‌చ్చినా అధికారం చేప‌ట్ట‌డం సాధ్యం అయ్యే ప‌ని కాదు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబునాయుడు బిజెపి నుంచి దూరం జ‌రిగారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల‌లేరు. అయినా కెసిఆర్ ఆధ్వ‌ర్యంలోని మూడో ప్ర‌త్యామ్నాయంలోకి వెళ్లే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. మ‌రి ఇవ‌న్నీ తెలియ‌కుండానే కెసిఆర్ త‌న మూడో ప్ర‌య‌త్నాన్ని మొద‌లు పెట్టారా? ఈ ప్ర‌శ్న‌వ‌ద్దే అనుమానాలు రేకెత్త‌తున్నాయి. కెసిఆర్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం న‌రేంద్ర మోడీ ఆడిస్తున్న నాట‌క‌మ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్న కార‌ణం కూడా ఇదే.

మూడో ఫ్రంట్ బ‌ల‌ప‌డకుండా ముందుగా త‌న అనుకూల‌మైన వ్య‌క్తి తోనే మూడో ప్ర‌య‌త్నం చేయించాల‌ని మోడీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా చెప్పుకుంటున్న‌ది కూడా ఈ కార‌ణంతోనే. చంద్ర‌బాబునాయుడు మూడో ఫ్రంట్ అని బ‌య‌లుదేరితే దేశంలోని చాలా పార్టీలు ఆయ‌న వెనుక ర్యాలీ అవుతాయ‌ని, అది జ‌ర‌గ‌కుండా చేసేందుకే మోడీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ను ముందుకు తోశార‌ని చెబుతున్నారు.

ఇవ‌న్నీ ఆధారాలు లేని ఆరోప‌ణ‌లే. బిజెపి చెప్పిన‌ట్లు విన‌డానికి కెసిఆర్ సాధార‌ణ రాజ‌కీయ నాయ‌కుడు కాదు. సొంతంగా రాష్ట్రం ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వ‌చ్చిన అసాధార‌ణ రాజ‌కీయ నాయ‌కుడు. అందువ‌ల్ల‌నే కెసిఆర్ వేసే ప్ర‌తి అడుగును దేశం నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ది. మ‌మ‌తా బెన‌ర్జీకి కెసిఆర్‌కు మ‌ధ్య ఏం చ‌ర్చ‌లు జ‌రిగాయ‌నేది బ‌య‌ట‌కు వెల్ల‌డి అయ్యే అవ‌కాశం లేదు.

చంద్ర‌బాబునాయుడు ఎన్‌డిఏ నుంచి బ‌య‌ట‌కు రాగానే మ‌మ‌తా బెన‌ర్జీ ఫోన్ చేసి ఆయ‌న‌తో మాట్లాడారు. అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌న‌తో మ‌మ‌తా బెన‌ర్జీ చాలా కాలంగా స‌ఖ్య‌త‌గానే ఉంటున్నారు. ఆ సఖ్య‌త‌ను చెడ‌గొట్టేందుకు కెసిఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారా? తెలియ‌దు.

లేక కెసిఆర్‌ను చంద్ర‌బాబునాయుడిని క‌లిపేందుకు మమ‌త ప్ర‌య‌త్నిస్తారా? తెలియ‌దు. ఈ ముగ్గురు క‌లిస్తే మాత్రం మోడీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం అని మాత్రం చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈ ముగ్గురు క‌లిస్తే మాత్రం జాతీయ స్థాయిలో మ‌రిన్ని పార్టీలు మోడీకి వ్య‌తిరేకంగా వ‌చ్చేస్తాయి.

English Summery: Telangana Chief Minister K.Chandrasekhara rao proceeding to form the third front in Indian politics. What about the Andhra Pradesh Chief Minister N.Chandrababunaidu? whether he goes with KCR? it is a million dollar question.

Leave a Reply