పునాదులు పెకలించివేసిన చంద్రబాబు

Share Icons:

తిరుపతి, నవంబర్ 01,

ఇటీవల చిరంజీవి కుమారుడు రాంచరణ్ సినిమా రంగస్థలంలో ఆగట్టు నుంటావా నాగన్నా ఈ గట్టుకొస్తావా! అంటూ పాపులర్ పాట ఒకటి ఉంది. దాన్నే జస్ట్ కాస్త మార్చి… నాగన్నా మారుగా ఆగట్టు నుంటావా చంద్రన్నా ఈ గట్టుకొస్తావా!  అని పాడుకుంటే. . ఈ సందర్భానికి అతికినట్టు సరిపోతుంది. సహజంగానే చంద్రన్న ఆగట్టుకే వెళ్లిపోయాడు. నావ రాజకీయ తీరం చేరింది. కాకపోతే అందుకు తేదేపా నేత ఎన్నుకున్న సమయం మరీ బాగాలేదు. నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. రాజకీయ నేతల తీరు తెన్నులు ఎలా ఉన్నా,  నవంబర్ 1వ తేదీ ప్రాముఖ్యం దానిదే… ఎక్కడికీ పోదు. ఇంతటి పవిత్రమైన రోజున.. తెలుగుదేశం కాంగ్రెస్ తీరానికి చేరింది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిన పార్టీ నేత నేడు ఢిల్లీలో పిల్లకాకుల చెంతచేరారు. అనుభవం అంత వయసు లేనివారితో భుజాలు రాసుకుని తిరుగుతున్నారు.

దాదాపు 36 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఎందుకు పురుడుపోసుకుందో తెలిసినవారు, ఆ నాడు నందమూరి ఢిల్లీకి వ్యతిరేకంగా గర్జించిన సింహనాదాలను విన్నవారు..  పేద, ధనిక, చిన్నా, పెద్దా తేడా లేకుండా.. 9 మాసాల ప్రాంతీయ పార్టీని అక్కున చేర్చుకున్నవారు నేడు ఖిన్నులయ్యారు.. బాబు సారథ్యంలోని తేదేపా కాంగ్రెస్తో జట్టు కట్టడాన్ని ఆ పార్టీలోని సీనియర్ నేతలు, ఆనాడు అన్న ఎన్టీయార్ తో కలిసి నడిన నాయకులు ఎలా అంగీకరిస్తున్నారు. వారికిది జీర్ణమయ్యే విషయమేనా.. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న నాయకులు, సామాన్య కార్యకర్తలు దీనిని ఎలా స్వాగతిస్తున్నారు.

నిజమే.. రాజకీయాలలో శాశ్వత శత్రువులు – శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. అందువలన మరీ సిగ్గువిడిచి, లజ్జారహితంగా పార్టీ ఏర్పడిన పునాదులనే పెకిలించివేసే వైచిత్రిని నేడు చంద్రబాబు  అదే ఢిల్లీ వీధుల్లోబాహాటంహా ప్రదర్శించి చూపారు.  తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిర్భయంగా తాకట్టుపెట్టారు.  ఎందుకింత దిగజారిపోయారు. రాష్ట్రంలో  జగన్ పై దాడి కోసు పలు మలుపులు తిరుగుతోంది. అందులో వాస్తవాలు  చాలా వెలుగు చూడవలసి ఉంది.  జగన్ ఇప్పటికే తనపై దాడి విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ తనకేమైనా  వ్యతిరేక ఫలితం వస్తే ఆదుకోవడానికి ఢిల్లీ లో లాబీఇంగ్ చేసేవారికోసం చంద్రబాబు ఆరాట పడ్డారా… బిజేపీతో చెడింది కనుక కాంగ్రెస్ తో అన్నా జట్టు కట్టాలనుకున్నారా… ఇంత తొందరగా, ఈరోజే కాంగ్రెస్ తో చేయికలపవలసిన అవసరం ఏమొచ్చిందో. . 

ఏ ఆత్మగౌరవం కోసం ఎన్టీయార్ తన సుఖమయ సినీ జీవితాన్ని ఫణంగా పెట్టి రాజకీయాలలోకి వచ్చారో ఆ పవిత్ర ఆశయానికి చితిపేర్చినరోజుగా నేడు చరిత్రలో నిలిచిపోతుంది. అవసరం ఎంత పనైనా చేయిస్తుందనే దానికి మరో చక్కటి ఉదాహరణగా తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీల పొత్తు కథను ఇక పొద్దదుకేవేళ చిన్న పిల్లలుకు రోజూ చెప్పుకోవచ్చు.   

అధికారమే పరమావధిగా మారిన కాలంలో ఇంతకంటే ఉన్నతంగా ఆలోచిచండం కూడా వృధా అనిపిస్తుంది ఇటువంటి సంఘటనలు చూచినపుడు. ఏముంది… కాంగ్రెసు ను ఎదిరించిన తెలుగుదేశం పార్టీ ని అదే కాంగ్రెసు నుంచి వచ్చిన (కాంగ్రెస్ డీఎన్ఏ కలిగిన) నాయకుడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చాడు…  కథలన్నీ కంచికి చేరినట్టు ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ లోకే చేరుతాయనుకోవాలా… అట్లా అనుకోవడానికి కూడా ఇక్కడ వీలులేదే… తెలుగుదేశం పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకత కదా.. ఆ పాయింట్ కన్వీనెంట్ గా మర్చిపోతే చరిత్ర క్షమిస్తుందా.. తెలుగుదేశం.. ఈ తెలుగువేషం.

మామాట: కామాతురాణాం… అనే  శ్లోకం గురుతొస్తోంది ఎందుకో… ఏమో… 

One Comment on “పునాదులు పెకలించివేసిన చంద్రబాబు”

  1. పూర్వాపరాలను చక్కగా విశ్లేషించారు గంగాధరప్రసాద్ గారూ.

Leave a Reply