పీవోకే మనదే…దాన్ని పాకిస్థాన్ నుంచి లాగేద్దం…

Share Icons:

ఢిల్లీ:

 

జమ్మూ-కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి మంచి ఊపు మీదున్న కేంద్ర ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్ పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీని మీద కేంద్ర మంత్రులు సంచలన ప్రకటనలు కూడా చేస్తున్నారు. పీవోకే మనదేనని… దాన్ని స్వాధీనం చేసుకుందామని పలువురు కేంద్ర మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కశ్మీర్ కు ఇంతకాలం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేశామని… ఇక పీవోకేపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

 

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో విలీనమవ్వాలని భారతీయులంగా ప్రార్థించాలని అన్నారు. మూడు తరాల త్యాగాల తర్వాత ఆర్టికల్370 రద్దు కల సాకారమైందని చెప్పారు. ఒక చరిత్రాత్మక నిర్ణయం తర్వాత… ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో, సానుకూల ధోరణితో పాక్ నుంచి పీవోకేకు స్వాతంత్ర్యం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. చట్ట విరుద్ధంగా కశ్మీర్ లోని భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుందని చెప్పారు.

 

పీవోకేను భారత్ లో విలీనం చేసుకోవాలనే తీర్మానాన్ని 1994లో భారత్ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందనే విషయాన్ని జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. పీవోకేకు స్వాతంత్ర్యాన్ని కట్టబెట్టి, ముజఫరాబాద్ ను రాజధానిగా చేయాలని అన్నారు. కొంత మంది నేతలు కశ్మీర్ అంశాన్ని కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. భారత్ కు వ్యతిరేకంగా ఉన్న కశ్మీర్ నేతలను వారి గడ్డపైనే ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Leave a Reply