పౌరసత్వ సవరణ చట్టంపై రాష్ట్రాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త వ్యూహం…

opposition-parties-demand-judicial-probe-into-police-action-against-jamia-students
Share Icons:

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన  పౌరసత్వ సవరణ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా దీని వ్యతిరేకించాయి. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు తమ రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే కొందరు ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, చట్టం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తేంది. ఆన్ లైన్ ద్వారా పౌరసత్వం కల్పించాలని భావిస్తోంది.

జిల్లా కలెక్టర్ ద్వారా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విధానానికి బదులుగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని తీసుకురానున్నట్టు చెప్పాయి. కొత్త విధానం ద్వారా సీఏఏను ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయవచ్చని తెలిపాయి. సీఏఏ ద్వారా 2014 డిసెంబర్ 31కు ముందు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన హిందూ, సిక్కు, జైన్, పార్సీ, బుద్దిస్ట్, క్రిస్టియన్లకు మన దేశ పౌరసత్వం లభిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేసే ఎలాంటి అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని స్పష్టం చేశారు. కేవలం పార్లమెంటుకు మాత్రమే దీనిపై చట్టాలు చేసే అధికారం ఉందని అన్నారు. ఈ విషయంపై న్యాయ సలహాను తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సూచించారు.

కాగా, సీఏఏకు సంబంధించి కేరళ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేకంగా సమావేశమైంది. చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడానికి ముందు సభలో విజయన్ మాట్లాడుతూ… ఆరెస్సెస్ పై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ చట్టం ఆరెస్సెస్ అజెండాలో భాగమని అన్నారు. ముస్లింలను అంతర్గత శత్రువులుగా ఆరెస్సెస్ భావిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ నియంత్రిస్తోందని తెలిపారు.

 

Leave a Reply