మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ముగిశాకే మంత్రివర్గ విస్తరణ: ఏపీకి ఛాన్స్ దక్కేనా?

Share Icons:

ఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీలు ఉన్న 64 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు అక్టోబర్21 న జరగనుండగా, 24న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎన్నికలు ముగిశాక కేంద్రంలోని బీజేపీ మంత్రివర్గ విస్తరణ చేయాలనుకుంటుందని తెలుస్తోంది.

మోదీ ప్రస్తుత కేబినెట్ లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి ఉండగా..ఏపీ నుండి మాత్రం ప్రాతినిధ్యం లేదు. ఏపీలో బలపడాలని అడుగులు వేస్తున్న బీజేపీ ఈ సారి ఏపీ నుండి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. దీంతో ఏపీ నుంచి ఎవరికి అవకాశం దొరుకుతుందనే ఉత్కంఠత నెలకొంది. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో పాటుగా జీవీఎల్ నరసింహారావు పేరు పైన చర్చ సాగింది. వీరితో పాటుగా టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. అటు సీఎం రమేశ్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక ఢిల్లీలో ఉన్న ఏపీ బీజేపీ నేతల నుండి అందుతున్న సమాచారం మేరకు ఏపీ నుండి ఇద్దరి పేర్లను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మదిలో ఉన్నారని తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఏపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేష్ ప్రభుకు అవకాశం ఇవ్వటం ద్వారా ఏపికి ప్రాతినిధ్యం కల్పించటంతో పాటుగా ప్రభుత్వలో సమర్ధవంతమైన మంత్రిగా ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీకి చెందిన రాం మాధవ్ పేరును తొలి ప్రాధాన్యతగా అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే టీడీపీ నుండి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. సామాజిక వర్గాల పరంగా సజనా చౌదరికి అవకాశం ఇస్తే పార్టీలోని నేతలు.. కింది స్థాయి కేడర్ అంగీకరించరని రాష్ట్ర నేతలు నివేదించినట్లు తెలుస్తోంది.

పైగా సుజనా చౌదరి ఇప్పటికీ చంద్రబాబుకు అనుకూలురనే ముద్ర బలంగా వినిపిస్తోంది. దీని ద్వారా ఆ నలుగురికి కేంద్ర మంత్రివర్గంలో చాన్స్ దాదాపు లేనట్లుగా సమాచారం. మొత్తం మీద అయితే సురేశ్ ప్రభుకు గానీ, రామ్ మాధవ్ కు గానీ మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఎవరికి ఛాన్స్ దక్కుతుందో.

Leave a Reply